ఓరుగల్లులో గులాబీ జోరు

25 Apr, 2017 20:06 IST|Sakshi
ఓరుగల్లులో గులాబీ జోరు

వరంగల్ : ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతమంతా హోరెత్తించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలపై పథకాల జోరు గుప్పించారు. గుప్పిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సాధనలో తమ భాగస్వామ్యాన్ని నమ్మిన ప్రజలకు మరోసారి కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నారు. అందుకు వేదికగా ఓరుగల్లును ఎంపిక చేసుకున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లాలోనే టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలంటూ ఆదేశించడంతో పార్టీ శ్రేణులన్నీ ఈ నెల 27 న అంగరంగ వైభవంగా బహిరంగసభ నిర్వహణకు సమాయత్తమయ్యాయి. అధినేత అదేశించడమే తరువాయి చకచకా పనులు చేస్తూ నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఆవిర్భావ సభను సక్సెస్ చేయడానికి సిద్దమయ్యాయి.

ఒకవైపు సభ్యత్వనమోదు, మరోవైపు సభానిర్వహణకు కావలసిన ఏర్పాట్లతో ఓరుగల్లు గులాబీ దండు బిజీగా మారింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నడిబొడ్డిన ఉన్న ప్రకాశ్ రెడ్డిపేట ప్రాంతంలో ఎంపిక చేసిన కూడలిలో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఈ సభకు ప్రగతి నివేదన సభగా నామకరణం చేశారు.  అధికార టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వరంగల్ లో పార్టీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడానికి సంకల్పించారు.

రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో సభను సక్సెస్ చేయడానికి కమిటీలు రూపుదిద్దుకున్నాయి. కేసీఆర్ గతంలో పార్టీ పరంగా మూడు అతిపెద్ద బహిరంగ సభకు ఇక్కడే నిర్వహించారు. అదే సెంటిమెంట్ తో ప్రగతి నివేదనకు కూడా అదే స్థలాన్ని ఎంపిక చేశారు. కేసీఆర్ ప్రకాశ్ రెడ్డి పేట నుంచి తెలంగాణ సమరభేరి మోగించిన తరుణమే కేంద్ర ప్రభుత్వానికి కదలిక మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన భారీ బహిరంగ సభలలో ఎక్కువగా వరంగల్ లోనే జరిగాయి.

2001 ఏఫ్రిల్ 27 పార్టీ ఆవిర్భావం తర్వాత 2001 జూన్ 21వ తేదీన హన్మకొండ కేడిసి మైదానంలో తొలి బహిరంగసభ జరిగింది. కిర్తీ శేషులు బియ్యాల జనార్ధన్ రావ్ అప్పుడు బహిరంగసభను నిర్వహించారు. ఆ తర్వాత 2002 అక్టోబర్ 28 న భూపాలపల్లిలో బహిరంగసభ జరిగింది. 2003 లో టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పది లక్షల మంది తో హన్మకొండ ప్రకాశ్ రెడ్డిపేటలో బహిరంగసభను నిర్వహించి ఆ రోజుల్లో చరిత్ర సృష్టించారు. ఆ సభకు అప్పటి కేంద్ర మంత్రి అజిత్ సింగ్ హాజరయ్యారు.

2003 మే 12న జనగామ గడ్డపై పోరుగల్లు వీరగర్జన పేరుతో సభను నిర్వహించారు. తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 2005 జులై 17న భారీ బహిరంగసభను నిర్వహించి అప్పటి కేంద్ర మంత్రి శరద్ పవార్ ను ఆహ్వానించారు. 2006 జనవరి 16న వరంగల్ లో ఉత్తర తెలంగాణ జిల్లాల సమావేశం నిర్వహించారు. 2007 ఏప్రిల్ 27న మళ్లీ హన్మకొండ ప్రకాశ్ రెడ్డి పేట మైదానంలో తెలంగాణ విశ్వరూపమహాసభ పేరుతో ప్లీనరీ నిర్వహించారు.

2008 జనవరి 7వ తేదీన హన్మకొండ హయాగ్రీవాచారి మైదానంలో విద్యార్థి గర్జన పేరిట సభను నిర్వహించారు. 2009 నవంబర్ 23న కాకతీయ వర్సిటిలో విద్యార్థి జేఏసి సభను నిర్వహించారు. 2010 ఫిబ్రవరి 7న కేయూలో విద్యార్థి పొలికేక నిర్వహించగా 2010 డిసెంబర్ 16న మరోమారు ప్రకాశ్ రెడ్డి పేట మైదానంలో 25 లక్షల మందితో భారీ సభను నిర్వహించి చరిత్ర కెక్కారు ఆ పార్టీ ఉద్యమ నేత కేసిఆర్. ఈ సభ దేశ చరిత్రలోనే రికార్డ్ సృష్టించింది. ఎక్కడెక్కడినుంచో నేతలు, ప్రజలు సభకు తరలివచ్చారు. తిరిగి ఇప్పుడు అదే ప్రకాశ్ రెడ్డి పేటలో సభానిర్వహణకు కేసీఆర్ నిర్ణయించారు.

అప్పటివరకు ఉద్యమనేతగా ఓరుగల్లు ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఈ సభలో ప్రభుత్వాధినేతగా పాలక పక్షంగా టీఆర్ఎస్ ప్రజలకు ఎటువంటి హామీలిచ్చింది. ఎలా నెరవేరుస్తోంది.. చెప్పడానికి ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో తెలంగాణ సెంటిమెంట్ కు ఊతమిచ్చిన ప్రకాశ్ రెడ్డి పేట నుంచి ప్రజలకే చెప్పి వారి ద్వారానే ప్రతిపక్షాల నోళ్ళు మూయించడానికి సిద్దమవుతున్నారు. కనీసం పదిహేను లక్షల మందితో సభను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఆర్బాటంగా ఏర్పాట్లు

ప్రకాశ్ రెడ్డి పేటలో సభ నిర్వహణ కోసం దాదాపు 2 వేల ఎకరాల మేరకు విస్తరించి ఉంది. 8.5 లక్షల స్క్వేర్ మీటర్లలో సభ ఉంటుంది. మొత్తం 276 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8400 స్క్వేర్ ఫీట్లలో 10 ఫీట్ల ఎత్తుతో భారీ సభా వేదిక ఏర్పాటు చేయడమే కాకుండా వేదికపై సుమారుగా 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం 20 ప్రవేశ ద్వారాలను, 20 అవుట్ గేట్లను ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే వాహనాల కోసం 1463 ఎకరాల్లో తొమ్మిది పార్కింగ్ స్థలాలను ఎంచుకున్నారు. మరుగుదొడ్లు, వైద్యశిబిరాలు, ఇతరత్రా వసతుల కోసం 45 ఎకరాల్లో, విఐపి ల వాహనాల పార్కింగ్ కోసం 54 ఎకరాలు, వివిఐపిల వాహనాల కోసం 34ఎకరాల్లో కేటాయించారు. సభా స్థలికి, పార్కింగ్ స్థలాలు కూడా అదే క్యాంపస్ లో ఉండడంతో వచ్చి పోయే వారికి చాలా సులువు అని భావించి ఏర్పాట్లు చేశారు. కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సభ, పార్కింగ్ స్థలాలుండడం కొంత అనువు అని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు