మళ్లీ ఉత్తుత్తి హామీలేనా?

3 Jan, 2017 23:28 IST|Sakshi
మళ్లీ ఉత్తుత్తి హామీలేనా?

ప్రారంభానికి నోచుకోని డిగ్రీ కళాశాల పక్కాభవన నిర్మాణం
ప్రకటించి ఏడాది దాటినా మంజూరు కాని నిధులు
బుక్కపట్నం చెరువుకు నీటి విడుదల హుళక్కేనా?

 
బుక్కపట్నం : హామీ... భరోసా... పూచీ... పదమేదైనా సామాన్యుడిలో మనోధైర్యం పెంచేం‍దుకు దోహదపడుతుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరితో ఈ పదాలపై నేడు ప్రజలు విశ్వాసం కోల్పోయారు. పూటకో హామీని ఇస్తూ... దానిని నెరవేర్చకుండా మభ్య పెట్టేందుకు మరెన్నో పొంతన లేని మాటలతో ప్రజలను దగా చేస్తుండడంతో చంద్రబాబు మాటలకు విలువలేకుండా పోతోంది. ఇందులో భాగంగానే పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకూ గతంలో చంద్రబాబు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేరకపోవడం గమనార్హం. బుధవారం(నేడు) ఆయన బుక్కపట్నం మండలానికి రానున్న నేపథ్యంలో మళ్లీ ఎలాంటి హామీలతో మభ్య పెడతారో అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలన్నీ నీటిమూటలయ్యాయి. గతంలో ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తిరిగి వాటి ఊసే లేకుండా పోయింది. గత ఏడాది సెప్టెంబర్‌ 30న కొత్తచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు కోసం చంద్రన్న’ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆరు నెలల్లోపు బుక్కపట్నం చెరువును నీటితో నింపుతామని ప్రకటించారు. నేటికీ చుక్క నీరు కూడా వదల్లేక పోయారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను కలుపుతూ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామంటూ హామీనిచ్చిన ముఖ్యమంత్రి చివరకు ఈ ప్రతిపాదనకు సున్నా చేట్టేశారు. బుక్కపట్నం డిగ్రీ కళాశాలకు పక్కా భవనాల నిర్మాణం చేస్తామంటూ విజయవాడలో ఆర్భాటంగా ప్రకటించారు. నేటికీ ఈ హామీకి దిక్కుమొక్కులేకుండా పోయింది.

పలుమార్లు విన్నవించుకున్నా...
బుక్కపట్నంలో 1984లో భగవాన్‌ సత్యసాయిబాబా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ కళాశాలను బాలుర ఉన్నత పాఠశాలలోనే ప్రారంభించారు. పక్కా భవనం నిర్మించాలం‍టూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కళాశాల సిబ్బంది, పుర ప్రజలు పలుమార్లు విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

ప్రకటనకే పరిమితమైన నిధుల మంజూరు
గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్‌ల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆనాటి ఈ సమావేశంలో వారు సీఎం మాట్లాడుతూ.. బుక్కపట్నంలో కళాశాల పక్కా భవనాల నిర్మాణం కోసం తక్షణమే రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రతికలు సైతం ప్రముఖంగా ప్రచురించాయి. ఆ తర్వాత నిధుల మంజూరు విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు మొదలు పెట్టలేకపోయారు. కళాశాల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చి ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. వారి దాతృత్వం కూడా సీఎం వైఖరితో నిష్ర్పయోజనమైపోయింది.

మరిన్ని వార్తలు