నేనింతే !

21 Apr, 2017 23:41 IST|Sakshi
నేనింతే !

– ‘అనంత’ అంటే వల్లమాలిన అభిమానమంటూ పదేపదే వల్లె వేస్తున్న చంద్రబాబు
– అవసరమైతే ప్రతి పుట్టినరోజునూ ఇక్కడే చేసుకుంటానని ప్రకటన
– టీడీపీని ఆదరిస్తోన్న ‘అనంత’వాసులు..  వంచిస్తోన్న చంద్రబాబు
– ‘అనంత’ అభివృద్ధికి మూడేళ్లలో ఎలాంటి చర్యలకూ ఉపక్రమించని వైనం
– సాగునీరు, పంట నష్టపరిహారం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తీరని అన్యాయం
– సీఎం తీరుపై మండిపడుతున్న విపక్షాలు


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
- ‘అనంత అంటే నాకు అమితమైన ఇష్టం. మొన్న చైనాకు వెళుతుంటే ఫ్లైట్‌లో కలలోనూ నాకు అనంతపురం గుర్తొచ్చింది. ఏ విషయంలోనైనా ఈ జిల్లాకే మొదటి ప్రాధాన్యం.’
– గత ఏడాది పుట్టినరోజున గొల్లపల్లి రిజర్వాయర్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాటలివి.
- ‘పోయిన బర్త్‌డే గొల్లపల్లిలో జరుపుకున్నా. ఇప్పుడు పామిడిలో చేసుకుంటున్నా. ఈ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం. అవసరమైతే కరువు రహిత జిల్లాగా మార్చే వరకూ ‘అనంత’లోనే బర్త్‌డే చేసుకుంటా.’ – ఈ నెల 20న పామిడి సభలో సీఎం ప్రకటన .
      
చంద్రబాబు మాటలు వింటే ఆయన ఈ జిల్లాపై ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారోనని అనిపిస్తుంది. నిజానికి ఆయన మాటలకు, చేతలకు ఏమాత్రమూ పొంతన ఉండటం లేదు. ‘నోరు ఒకటి చెబుతుంది..చెయ్యి ఇంకోటి చేస్తుంది.. దేనిదోవ దానిదే!’ అన్నట్లుంది సీఎం వైఖరి! ‘అనంత’ అంటే ఎంతో ఇష్టమని తరచూ చెప్పే చంద్రబాబు మూడేళ్లలో ఈ జిల్లాకు తానేం చేశానని ఆత్మపరిశీలన చేసుకున్నా... చంద్రబాబు ఏం చేశారని జిల్లావాసులు నిశితంగా పరిశీలించినా తేలేది ఒకే సత్యం! అందరితో పాటు పింఛన్ల పెంపు తప్ప అంతకు మించి ఏమీ చేయలేదని! మూడేళ్లలో ఒక్క పరిశ్రమ లేదా విద్యాసంస్థను జిల్లాలో ఏర్పాటు చేయలేదు. హంద్రీ–నీవా ద్వారా ఐదేళ్లుగా జిల్లాకు కృష్ణాజలాలు వస్తుంటే కనీసం ఒక్క ఎకరాకూ అందివ్వలేదు. మూడేళ్లలో ఒక్క పేదవాడికీ ఇళ్లు నిర్మించలేదు.

మంజూరైన వాటినీ తరలించారు!
    రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లాలో ఎలాంటి సంస్థలనూ నెలకొల్పే చర్యలకు ఉక్రమించకపోగా.. కేంద్రప్రభుత్వం ప్రకటించిన వాటినీ దూరం చేశారు. ‘అనంత’లో ఎయిమ్స్‌(ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) అనుబంధ కేంద్రాన్ని స్థాపిస్తామని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2014లో పొందుపరిచింది. అయితే.. దీన్ని చంద్రబాబు విజయవాడకు తరలించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కూడా బిల్లులో పొందుపరిచారు. రెండేళ్లుగా అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని చెప్పడం మినహా ఇప్పటి వరకూ ఆమోదముద్ర పడలేదు. రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి స్థల నిర్ధారణ పత్రాలు పంపకపోవడంతో వర్సిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని సమాచారం.

21 వరాల్లో ఒక్కటైనా...
        రాజధాని ప్రకటన సమయంలో చంద్రబాబు  అసెంబ్లీలో ప్రతి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అందులో భాగంగా ‘అనంత’కు 21 వరాలిచ్చారు. అనంతను హార్టికల్చర్‌ హబ్‌  చేస్తానన్నారు. కనీసం ధరల స్థిరీకరణకు కూడా చర్యలు తీసుకోలేదు. సబ్బుల ఫ్యాక్టరీ స్థాపిస్తామని.. అతీగతీ లేదు. నూతన పారిశ్రామిక నగరం, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్‌ క్లస్టర్, పెనుకొండలో ఇస్కాన్‌ ప్రాజెక్టు, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల తయారీ కేంద్రంతో పాటు పలు హామీలిచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఐదేళ్ల పాలనకు గాను మూడేళ్లు ముగిసిపోయింది. మరో రెండేళ్లలో ఏం చేస్తారో ఆయనకే తెలియాలి!

కరువు రైతుపై కనికరమేదీ?
    కరువుతో జిల్లా రైతులు కుదేలవుతున్నారు. తాగు, సాగునీటి కోసం ప్రజలు అవస్థ పడుతున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిలో హంద్రీ–నీవాను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పలుమార్లు ప్రకటించారు. అయితే.. 2015 ఫిబ్రవరిలో జీవో-22 జారీ చేసి డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని ఉత్తర్వులిచ్చారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయకట్టు గురించి ఆలోచించలేదు. నిజంగా చంద్రబాబుకు జిల్లాపై అంత ప్రేమ ఉంటే మూడేళ్లుగా డిస్ట్రిబ్యూటరీలు ఎందుకు పూర్తి చేయలేదో? ఈ ఏడాది 28 టీఎంసీల నీరొచ్చినా ఒక్క ఎకరాకూ ఎందుకివ్వలేదో చెప్పాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు.  కుప్పం వరకూ ప్రధాన కాలువ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీలు చేయబోమని చంద్రబాబు ‘అనంత’లోనే బాహాటంగా చెప్పారు. అప్పుడు తమ జిల్లాకు నీళ్లివ్వండి.. తర్వాత మీ జిల్లాకూ తీసుకెళ్లండని ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా సీఎంకు చెప్పలేకపోయారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు  తమ రాజకీయ అవసరాల కోసం జిల్లా ప్రజల సంక్షేమాన్ని ఫణంగా పెడుతున్నారు. జిల్లా వాసులు  గత ఎన్నికల్లో 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీని గెలిపించారు. ఇంత అభిమానం చూపించిన జిల్లాకు చంద్రబాబు ఏమీ చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ఆయన వైఖరిపై  ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరముంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ అధినేత ‘అలవిమాలిన ప్రేమ’లో ఎంత నిజాయితీ ఉందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు