సింగరేణిపై సీఎం దృష్టి

25 Jun, 2016 00:59 IST|Sakshi

త్వరలో విస్తృత స్థాయి సమావేశం
‘గుర్తింపు’ ఎన్నికల నేపథ్యం
హామీల కోసం ఆసక్తిగా చూస్తున్న కార్మికులు


కొత్తగూడెం(ఖమ్మం) : రాష్ట్రంలో ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ఈసారి సింగరేణిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల విద్యుత్, ఆర్టీసీ అధికారులతో సమావేశమైన ఆయన త్వరలోనే సింగరేణి అధికారులతో విస్తృత స్థాయి సమావే శం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే త్వరలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రాధాన్య త ను సంతరించుకుంది.

ఈ ఏడాది ఆగస్టుతో ప్రస్తుతం ఉన్న గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియనుంది. తర్వాత రెండు మూడు నెలల్లో తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గుర్తింపు యూనియన్ హోదాలో ఉంది. సంఘంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, గత ఎన్నికల సమయంలో గని కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడంతో రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలని నాయకులు ఆందోళన చెందుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ తిరిగి సింగరేణి కార్మికుల సమస్యలపై వాకబు చేయడం చర్చనీయాంశంగా మారింది.


 కంపెనీ అభివృద్ధిపైనేనా..?
 కేవలం సంస్థ అభివృద్ధి పైనే సీఎం సమీక్షిస్తారా అని కార్మికులు చర్చించుకుంటున్నారు. సింగరేణి సంస్థ ఈ ఏడాది 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకు న్న నేపథ్యంలో కొత్త గనుల ఏర్పాటు, ఇటీవల చేపడుతు న్న నూతన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ, ఇతర వ్యాపారాభివృద్ధికి సంబంధించిన అంశాలు, జైపూర్‌లో సింగరేణి చేపట్టి న పవర్ ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా గుర్తింపు సంఘం ఎన్నికలపైనా ప్రత్యేకం గా అనుంబంధ కార్మిక సంఘం నాయకులతో చర్చించనున్నట్లు సమాచారం.


‘వారసత్వం’పై కార్మికుల ఆశలు
సీఎం సమావేశం నిర్వహిస్తారని తెలియడంతో సింగరేణి కార్మికుల్లో వారసత్వ ఉద్యోగాల ప్రకటనపై ఆశలు చిగురి స్తున్నాయి. ఈ సమావేశంలో సీఎం వారసత్వ ఉద్యోగాల పై ప్రకటన చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సొంతింటి పథకం, సంస్థలో పనిచేస్తున్న సుమారు 20వేల మంది కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, డిస్మిస్డ్ కార్మికులు తదితర సమస్యలపై గత గుర్తింపు ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నిక ల్లో సైతం కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక అసెంబ్లీలో సైతం దీనిపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటిపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు