సీఎంఆర్‌ఎఫ్ లేఖ ఫోర్జరీ

10 Nov, 2015 23:47 IST|Sakshi

వరంగల్ జిల్లాలో బయటపడ్డ మోసం

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి సీఎం సంతకంతో జారీ చేసే సహాయ మంజూరు పత్రం ఫోర్జరీకి గురైన ఉదంతం బయటపడింది. వరంగల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లుగా అందిన దరఖాస్తుకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఇటీవల రూ. లక్ష ఆర్థికసాయం మంజూరవగా దరఖాస్తుదారు దాన్ని రూ.4 లక్షలుగా మార్చి ఆస్పత్రికి సమర్పిం చాడు. ఆ లేఖ ఆధారంగా ఆస్పత్రి యాజమాన్యం కొద్ది రోజుల తర్వాత సీఎం ఆర్‌ఎఫ్‌ను సంప్రదించగా అధికారులు అది ఫోర్జరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై సీఎం కార్యాలయం ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు ఈ తరహా మోసం జరగటం ఇదే మొదటిసారా లేక ఇప్పటికే మరిన్ని నిధులు పక్కదారి పట్టాయా? అనే దానిపై సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు.

బోగస్ బిల్లులు, తప్పుడు క్లెయిమ్‌లతో జరిగిన అక్రమాలపై ఇప్పటికే సీఎం కార్యాలయం సీఐడీతో దర్యాప్తు చేయించగా 2014 జూన్ 2 నుంచి సీఎంఆర్‌ఎఫ్‌కు వచ్చిన 9,200 దరఖాస్తుల్లో 68 కేసుల్లో బోగస్ బిల్లులున్నట్లు తేలింది. దాదాపు రూ. 36 లక్షలకుపైగా నిధులు పక్కదారి పట్టినట్లు గుర్తించింది. అప్పట్నుంచీ సీఎంఆర్‌ఎఫ్ చెల్లింపులపై సర్కారు మరింత అప్రమత్తమైంది.

మరిన్ని వార్తలు