‘లూజ్‌’ దందా..!

29 Jun, 2017 05:02 IST|Sakshi
‘లూజ్‌’ దందా..!

♦  బీజీæ3 విత్తనాల విక్రయాలతో రూ.కోట్ల వ్యాపారం
ఉమ్మడి జిల్లాలో 50 శాతానికి పైగా లూజు విత్తనాల సాగు
అధిక దిగుబడి, గడ్డి సమస్య   ఉండదని నమ్ముతున్న రైతులు
గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల ద్వారా దందా
ఇప్పటికే 10కి పైగా కేసులు.. అయినా ఆగని అమ్మకాలు
చోద్యం చూస్తున్న వ్యవసాయ అధికారులు

ఉమ్మడి జిల్లాలో బీజీ3 పత్తి విత్తనాల పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం సాగినట్లు వ్యవసాయ అధికారులే ఒప్పుకుంటున్నారు. మండల, జిల్లా వ్యవసాయ అధికారులెవరూ ఈ విత్తన వ్యాపారుల జోలికి వెళ్లిన దాఖలాలు తక్కువ.ఏప్రిల్‌ 17న మందమర్రి మండలం గద్దెరాగిడిలో సుమారు రూ.90లక్షల విలువ చేసే అక్రమ విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు సీజ్‌ చేశారు.

బుధవారం నెన్నెలలో ఇద్దరు రైతుల నుంచి 25 కిలోల అక్రమ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.కుమురం భీం జిల్లాలో నాలుగు నకిలీ విత్తనాల కేసులు నమోదు చేయగా, రూ.5లక్షల విలువైన పత్తి విత్తనాలను సీజ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా మూడు కేసులు నమోదయ్యాయి. వ్యవసాయ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి విత్తనాలను సీజ్‌ చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్నా అవన్నీ నామమాత్రమే. దీంతో నకిలీ బీజీ3 విత్తనాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

ఉమ్మడి జిల్లాలో ఈ ఖరీఫ్‌లో పత్తి సాగు ఇలా (హెక్టార్లలో)
  జిల్లా                              మొత్తం సాగు విస్తీర్ణం                    పత్తి సాగు అంచనా
ఆదిలాబాద్‌                                         2,00,000                  1,28,698
నిర్మల్‌                                               1,67,573                   73,420
కుమురం భీం                                      1,20,000                     74,513    
మంచిర్యాల                                            91,860                 48,444

సాక్షి, మంచిర్యాల: అక్రమ పత్తి విత్తనాల వ్యాపారుల చేతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులు చిక్కుకున్నారు. మన దేశంలో అనుమతి లేని బీజీ3 విత్తనాల మాయలో పడ్డ రైతులు ఊళ్లల్లోకి వచ్చిన విత్తనాలను ఎగబడి కొంటున్నారు. ఈ విత్తనాలతో అధిక దిగుబడి రావడమే గాక గడ్డి సమస్య ఉండదని దళారులు చెప్పే మాటలను నమ్మి ఊరు పేరు లేని పత్తి విత్తనాలను వేలంవెర్రిగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 60 శాతం రైతులు పత్తి సాగుచేస్తే అందులో బీజీ3గా చెపుతున్న ‘లూజు’ విత్తనాలను నాటిన రైతులే ఎక్కువ. బీజీ3 విత్తనాల వల్ల భూసారం తగ్గుతుందని భయపడి సొంత భూముల్లో వ్యవసాయం చేసే రైతులు మాత్రమే బ్రాండెడ్‌ కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తుండగా, 80 శాతం కౌలు రైతులు మాత్రం అధిక దిగుబడి కోసం వరకు బీజీ విత్తనాల మాయలో పడిపోయారు.
అధిక దిగుబడి పేరుతో దందా
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో పత్తి సాగుబడి ఎక్కువ. సుమారు 6లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉన్న ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం 3.20 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం చెప్పిన మాటలు విని పత్తి స్థానంలో సోయా సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో పత్తికి గిట్టుబాటు ధర పెరగడంతో ఈసారి రైతులు పత్తి సాగుపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీన్ని అక్రమ వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన వ్యాపారులు ఏకంగా మండల కేంద్రాల్లోనే దందాకు తెరలేపారు.

రైతులనే ఏజెంట్లుగా పెట్టుకొని గత రెండు నెలలుగా బీజీ3 పేరుతో వ్యాపారం ప్రారంభించారు. వర్షాలు పడడంతో పత్తి సాగుకు రైతులు సిద్ధం కాగానే దళారులు వారిని ఆశ్రయించి తక్కువ ధరకు పత్తి విత్తనాలు అంటగట్టారు. మార్కెట్‌లో పేరున్న కంపెనీలకు చెందిన 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్‌ రూ.900 వరకు ఉండగా, అరకిలో లూజు (పాకెట్‌ లేకుండా) పత్తి విత్తనాలను రూ.500 లోపు విక్రయించడం ప్రారంభించారు. డిమాండ్‌ పెరగడంతో రైతులనే ఏజెంట్లుగా నియమించుకొని భారీగా వ్యాపారం సాగించారు. ఇప్పటికే సుమారు 2లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెపుతుండగా, అందులో 60 శాతం ఈ బీజీ3 విత్తనాలనే నాటినట్లు తెలుస్తోంది.
లూజు విత్తనాలుగానే...
బీజీ3 విత్తనాలుగా చెపుతున్న పత్తి సీడ్‌కు సంబంధించి వ్యాపారుల వద్ద ఎలాంటి ఆధారం ఉండదు. కేవలం నమ్మకం పైనే కోట్ల రూపాయల దందా సాగుతోంది. సంచుల్లో విత్తనాలను తీసుకొచ్చి ఏజెంట్లుగా నియమించుకున్న రైతుల ఇళ్లల్లోకి చేరవేస్తున్నారు. అరకిలో విత్తనాలకు రూ.500 లోపు ధరతో కిలో, అరకిలో చొప్పున సదరు రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. లూజుగా విక్రయించిన ఏజెంటుకు ఒక్కో కిలోకు రూ.100కు పైగానే లాభం ఉంటుంది. విత్తనాలు కొనుగోలు చేయడానికి రశీదులను ఇవ్వరు. విత్తనాల ప్యాకెట్లు బ్యాచ్‌ నెంబర్లు ఉండవు. వివిధ ధరలలో సంచుల్లో విక్రయిస్తారు. అందుకే వాటిని ‘లూజు విత్తనాలు’గా పేర్కొంటున్నారు.
ఆంధ్రా నుంచే అధికం..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, నెల్లూరు, కర్నూలు వంటి జిల్లాలకు చెందిన వారు కార్లల్లో వచ్చి ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు నెలల క్రితం మొదలైన దందా నిర్మల్, కుమురం భీం, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో వేళ్లూనుకుపోయింది. బహిరంగ మార్కెట్‌లో పత్తి బీజీ2 విత్తనాలను కొనుగోలు చేసే నాథుడు కనిపించని పరిస్థితి నెలకొంది. అయితే వ్యవసాయ అధికారులకు ఈ తతంగం మొత్తం తెలుసని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలతోనే ఈ వ్యాపారం సాగుతోందని సమాచారం. మహారాష్ట్ర నుంచి కూడా ఆసిఫాబాద్‌ మీదుగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం సాగుతోంది.
కంపెనీ ఏం చెబుతోందంటే...
మోన్‌శాంటో కంపెనీ బోల్‌గార్డ్‌3 పేరుతో విడుదల చేసిన విత్తనాలు ఆస్ట్రేలియా దేశపు వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినట్లు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. అంటే ఆస్ట్రేలియా వాతావరణ పరిస్థితుల్లో అక్కడి చీడపీడల నివారణకు వాడే పురుగు మందుల వాడకాన్ని ఈ విత్తనాలు తగ్గిస్తాయని చెపుతోంది. క్రై 1ఏసీ, క్రై 2ఏబీ, విప్‌ 3ఏ అనే మూడు మార్గాల ద్వారా లార్వాల ను చంపుతాయి. నీరు తక్కువగా ఉన్నా ఈ విత్తనాలు ఏపుగా పెరుగుతాయని, అధిక దిగుబడి ని ఇస్తాయని చెపుతోంది. కానీ వ్యాపారులు మా త్రం ఈ విత్తనాలు నాటితే పెరిగిన గడ్డిని తొలగించేందుకు మందులు వాడినా, పురుగు మం దులు వాడినా పత్తి చేనుకు ఎలాంటి నష్టముం డదని చెపుతున్నారు. గత సంవత్సరం కూడా ఇవే విత్తనాలు వాడి అధిక దిగుబడి సాధించినట్లు చెపుతున్న మాటలను నమ్మి 60 శాతానికి పైగా రైతులు బీజీ3ని నాటారు. బీజీ3 విత్తనాల వల్ల భూసారం దెబ్బతింటుందనే భారత ప్రభుత్వం వాటికి దేశంలోకి అనుమతివ్వలేదని వ్యవసాయఅధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు