తీరం.. శోకం!

31 Oct, 2016 23:39 IST|Sakshi
తీరం.. శోకం!
ఎడారిని తలపిస్తున్న తుంగభద్ర
– ఎత్తిపోతల పథకాలలకు నీరందక అన్నదాత అవస్థలు
– పంట పొట్ట దశలో తీవ్రమైన నీటి  ఎద్దడి
– నీరు ఇవ్వాలని కోరినా స్పందించని ప్రభుత్వం
– నదీ తీరంలో ఎండుతున్న పంటలు
– సుమారు రూ.150 కోట్ల పంట నష్టపోయే ప్రమాదం
 
కర్నూలు సిటీ/నందవరం: వరుస కరువు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత రెండేళ్లుగా తీవ్ర వర్షాభావం నేపథ్యంలో తుంగభద్ర నదీ తీరంలో సాగు చేసిన పంటల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలతో ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసిన పంట చేతికొచ్చే దశలో నీరు లేక ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా వరి, మిరప పైర్లు సాగు చేసిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు నెల రోజులుగా నదిలో నీటి ప్రవాహం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమవుతోంది. అయితే నదికి నీటిని విడుదల చేయించే విషయంలో అధికార పార్టీ నేతలు ఎలాంటి ఒత్తిళ్లు తీసుకు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
వారంలోపు నీరివ్వకపోతే పంట ప్రశ్నార్థకం
జిల్లాలో 88 ఎత్తిపోతల పథకాలు.. తుంగభద్ర నదీ తీరంలో మొత్తం 20 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి కింద 25వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో పాటు మరో 30వేల ఎకరాల ఆయకట్టు నది నీటి ద్వారా సాగవుతోంది. ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడం వల్ల నది ఎడారిని తలపిస్తుంది. అధిక శాతం వరి, మిరప, చెరుకు, పత్తి, మొక్క జొన్న పంటలు సాగు చేశారు. ఈ పంటల సాగుకు ఎకరాకు రూ.20 వేలు నుండి రూ.30 వేలు వరకు పంటను బట్టి పెట్టుబడి పెట్టారు. ప్రస్థుతం వరి పంట కంకి దశలో ఉంది. ఈ దశలో నీరందకపోతే పంట దిగుబడి ప్రశ్నార్థకం అవుతుంది. మిగతా పంటల పరిస్థితీ అంతే. నదికి వారంలోపు నీరు రాకపోతే సుమారు రూ.150 కోట్ల రూపాయల పెట్టుబడులు గంగలో కలిసినట్లే. కేసీ వాటాగా ఉన్న 1.55 టీఎంసీల నీరు నదికి విడుదల చేయాలని జల వనరుల శాఖ ఇంజినీర్లు ఉన్నతాధికారులను ప్రాధేయపడుతున్నా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
 
పైరు కంకి దశలో ఉంది
తుంగభద్ర నది నీటిపై ఆధారపడి 15 ఎకరాల్లో వరి పంట సాగు చేసినా. అప్పు చేసి నది నుండి ప్రత్యేకంగా పొలం వరకు పైపులైను వేసుకున్నా. ఇందులో 7 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి.. సొంతంగా మరో 8 ఎకరాల్లో వరి పంట వేసినా. పంట సాగుకు కౌలు కింద ఎకరాకు రూ.40 వేలు, సొంత పొలం కింద ఎకరాకు రూ.20 వేలు చొప్పున ఖర్చయింది. పంట కంకి దశలో ఉంది. ఇప్పుడు నీరందిస్తేనే గింజ గట్టిపడుతుంది. నదిలో నీరు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఉంది.
– భీమారెడ్డి, రైతు, చిన్నకొత్తిలి
  
పెట్టుబడులకు అప్పులు చేసినా
నందవరం ఎత్తిపోతల పథకం కింద 12 ఎకరాల్లో పత్తిన సాగు చేసినా. ప్రస్తుతం నదిలో నీరు లేదు. చెలమలు తవ్వినా చుక్క నీరు కనిపించట్లేదు. ఈ పథకం కింద దెబ్బతిన్న పైపులైన్‌ను పట్టించుకునే వారే లేరు. రూ.1.50 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టినా. అయితే నీరందక పంట ఎండిపోతోంది. పైరుకు నీరందిస్తే కనీసం పెట్టుబడి అయినా దక్కుతుంది.
– నాగరాజు, రైతు, నందవరం
 
టీబీ డ్యాం నుంచి నీరివ్వాలని కోరాం
తుంగభద్ర డ్యాం నుంచి కేసీ వాటా నీరు ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఇటీవల విజయవాడ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పాం. నీటి విడుదలపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– ఎస్‌.చంద్రశేఖర్‌ రావు, జల వనరుల శాఖ ఎస్‌ఈ

 

మరిన్ని వార్తలు