తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం

13 Sep, 2016 20:22 IST|Sakshi
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం
అధికారులకు జెడ్పీ ఇన్‌చార్జ్‌ సీఈవో వెంకటసుబ్బయ్య ఆదేశం
 
అచ్చంపేట: భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరదనీరు చేరుతోందని, ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున  తీర ప్రాంత గ్రామాలను అప్రమత్తం చేయాలని జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జ్‌ సీఈవో వెంకటసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం ఆయన ఎమ్మార్వో, ఏపీడీవోలతో పరిస్థితులపై సమీక్షించారు. ప్రాజెక్టులో వరద నీరు చేరడం వల్ల బెల్లంకొండ మండలంలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. ముందస్తుగా ముంపు గ్రామాలవారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు స్థానికులను తరలించాలన్నారు. ముంపు గ్రామాలకు చెల్లించాల్సిన పరిహారం మొత్తం చెల్లించామన్నారు.  వేమవరం, రేగులగడ్డ, గోవిందాపురం గ్రామాలకు 50 శాతం చెల్లించినట్లు చెప్పారు. నదీ తీర ప్రాంత గ్రామస్తులు, జాలర్లు ఎవరూ నదిలోకి వెళ్లకుండా నదుల వద్ద సిబ్బందిని కాపలా ఉంచాలని సూచించారు. ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు చేరినా ఏ విధమైన ఇబ్బంది ఉండదని, అచ్చంపేట మండలం ప్రాజెక్టుకు దిగువ ప్రాంతంలో ఉండడం వల్ల ఏ విధమైన అంతరాయం కలగదని తహసీల్దారు జి.సుజాత తెలిపారు. పునరావాస కేంద్రానికి నిర్వాసితులు కోరుకున్న పేరు పెట్టుకునే వెసులుబాటు వుందని, పేరు ఎంపిక చేసుకుని ఉన్నతాధికారులకు పంపితే నెలరోజుల్లో ప్రత్యేక పంచాయతీగా గుర్తింపు వస్తుందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తి చేసుకుంటే వాటికి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు పీవీ రామారావు ఉన్నారు.
మరిన్ని వార్తలు