కొబ్బరి కొనుగోలుకు రైతుల ధర్నా

22 Aug, 2016 23:23 IST|Sakshi
కొబ్బరి కొనుగోలుకు రైతుల ధర్నా
అంబాజీపేట : 
నాఫెడ్‌ కొబ్బరి కొనుగోలు కేంద్రాల్లో 18 రోజులుగా కొబ్బరి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు సోమవారం సాయంత్రం ధర్నాకు దిగారు. ఈ నెల 5 నుంచి నాఫెడ్‌ కేంద్రంలో కొబ్బరిని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాఫెడ్‌ కేంద్రాల నుంచి కొబ్బరిని కొనుగోలు చేయాలంటూ మార్కెట్‌ యార్డు గేటు వద్ద, రహదారిపై ధర్నా నిర్వహించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో కొబ్బరిని కొనుగోలు చేయకుండా తాత్సారం చేశారన్నారు. కొబ్బరి సరకులు నాణ్యత ఉన్నా కొబ్బరిని ఎందుకు కొనుగోలు చేయలేదంటూ నిలదీశారు. నాఫెడ్‌ కేంద్రానికి సెలవు వస్తే ముందుగా ప్రకటించాలన్నారు. ఆందోళనకారులతో ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అరిగెల బలరామమూర్తి, స్థానిక నాయకుడు సుంకర బాలాజీ చర్చించారు. నాఫెడ్‌ కేంద్రం నుంచి కొబ్బరిని కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తే మినహా ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. దాంతో ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఆయిల్‌ఫెడ్, నాఫెడ్‌ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఫోన్‌లో వివరించారు. నాఫెడ్‌లో కొబ్బరిని కొనుగోలు చేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానిక నాయకుల సూచనలతో ఆందోళన విరమింపజేశారు. అనంతరం స్థానిక మార్కెట్‌ యార్డులో కొబ్బరి రైతులు సమావేశమయ్యారు. రైతుల సమస్యలను చైర్మన్‌తో పాటు సొసైటీ అధ్యక్షుడు గణపతి వీర రాఘవులు ఫోన్‌ ద్వారా ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి, నాఫెడ్, ఆయిల్‌ ఫెడ్‌ అధికారులకు వివరించారు. ఆయిల్‌ ఫెడ్‌ డిప్యూటీ మేనేజర్‌ సుధాకరరావు, నాఫెడ్‌ అధికారి రామచంద్రారెడ్డి, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు మార్కెట్‌ యార్డుకు చేరుకుని రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. నిబంధనల మేరకు మంగళవారం నుంచి కనీసం రోజుకు వెయ్యి బస్తాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
 
మరిన్ని వార్తలు