కొబ్బరి ధర పతనం

10 Oct, 2016 21:41 IST|Sakshi
కొబ్బరి ధర పతనం
కాయకు మిగిలేది రూపాయే... ∙
అంబాజీపేట మార్కెట్‌లో వెయ్యి కాయల ధర రూ. 3,500
తీరప్రాంత మండలాల్లో రూ.2,500 ∙
గొల్లుమంటున్న కొబ్బరి రైతులు
అమలాపురం/ అంబాజీపేట : ఆశించితి నత్తగారా.. అన్నట్టుగా ఉంది కొబ్బరి రైతుల పరిస్థితి. ఇటీవల కాలంలో కొబ్బరి కాయ ధర తగ్గిపోయింది. పండగ సీజన్‌లో పెరగవచ్చంటూ రైతులు ఆశలు పెంచుకున్నారు. అయితే ఈ సీజన్‌లో కూడా ధర కనిష్ట స్థాయికి దిగజారిపోయింది. దాంతో డీలా పడిన రైతు దింపులు తీసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇది పండగల సీజన్‌.. ఇప్పుడు దసరా.. నెలాఖరున దీపావళి.. వెంటనే కార్తీకమాసం. సాధారణంగా ఈ సీజన్‌లో కొబ్బరికి ఎనలేని డిమాండ్‌ ఉంటుంది. ధర పెరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో వెయ్యి పచ్చికొబ్బరి కాయల ధర రూ.3,400 నుంచి రూ.3,500 వరకు ఉంది. నెల్లాళ్లుగా ఇదే ధర నిలకడగా ఉంది. ధర పెరుగుతుందని రైతులు ఆశించారు. అయితే ధరలు పెరగకపోవడంతో వారు నీరుగారిపోయారు. ఉప్పలగుప్తం, అల్లవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం తదితర ప్రాంతాల్లో వెయ్యి కాయల ధర రూ.2,500 పలుకుతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ లేనందున ధర తగ్గినా వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపడడం లేదు. దీంతో ధర పెరుగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. 
మిగిలేది రూపాయే  
తీర ప్రాంత మండలాల్లో కొబ్బరి కాయ ధర రూ.2.50 పలకడం రైతులను నిర్వేదానికి గురి చేస్తోంది.  దింపునకు కాయకు 90 పైసలు, కాయలు పోగుపెట్టి రాశులుగా పోయడానికి మరో 40 పైసలు అడుగుతున్నారు. అంటే కాయకు రూ.1.30 పైసలన్నమాట. కాయకు వచ్చేది రూ.2.50. అంటే రైతుకు మిగిలేది రూ.1.20 మాత్రమే. శనగ కాయలు (100 కాయలకు 4 కాయలు), మోతమోసే కూలీలకు రెండు కాయలు ఇవి కాకుండా తొట్టి, చిన్నకాయలు పోగా రైతుకు కాయకు ఒక్క రూపాయి మాత్రమే మిగులుతోంది. దీంతో దింపులు మొత్తం ఆగిపోయాయి.  
ఏడాదిలో ఎంత మార్పు 
గత ఏడాది దసరా సీజన్‌లో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి) మినహా మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు భారీగానే ఉన్నాయి. గత ఏప్రిల్‌ నుంచే అంబాజీపేట మార్కెట్‌లో కొబ్బరి ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. నాఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కేవలం కొత్తకొబ్బరి ధర మాత్రమే పెరిగింది. 
 
>
మరిన్ని వార్తలు