కొబ్బరి రైతుకు కుడి భుజంగా...

28 Sep, 2016 23:43 IST|Sakshi
కొబ్బరి రైతుకు కుడి భుజంగా...
పలు పరిశోధనలు చేసిన డాక్టర్‌ చలపతిరావు
ఫలితాలు క్షేత్రస్థాయికి చేరేలా విశేష కృషి
అంబాజీపేట కేంద్రంలో సీనియర్‌ శాస్త్రవేత్తగా సేవలు
ఉత్తమ శాస్త్రవేత్తగా రేపు అవార్డు స్వీకరణ
అంబాజీపేట : కోనసీమ సిరికి ఇరుసు వంటిది కావడమే కాదు.. ఆ గడ్డ ‘సొగసరి’తనానికీ మూలం కొబ్బరి. అలాంటి కొబ్బరి సాగులో రైతులకు కొండంత అండగా నిలుస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌బీవీ చలపతిరావు. అంబాజీపేటలోని డాక్టర్‌ వైఎస్సార్‌  ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధన కేంద్రం కీటకశాస్త్ర విభాగంలో సీనియర్‌ శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న ఆయన ‘కొబ్బరిలో వచ్చే తెగుళ్ళు, యాజమాన్య పద్ధతులు’పై అధ్యయనం చేయడంతో వాటిపై పరిశోధనలు చేసి పలు విజయాలు సాధించారు. కొబ్బరిలో వచ్చే పురుగులు, తెగుళ్లపై ప్రత్యేక పరిశోధనలు చేసి, ఫలితాలను కరపత్రాలుగా రూపొందించి,  రైతులకు అవగాహన కల్పించడం ద్వారా మేలు చేకూరుస్తున్నారు.
జీవ నియంత్రణ పద్ధతిలో బదనికల ఉత్పత్తి
గత ఐదేళ్లుగా కీటక విభాగంలో గణనీయమైన పరిశోధనలు చేసిన డాక్టర్‌ చలపతిరావు వాటి ఫలితాలు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రచారం చేశారు. ప్రతి పరిశోధనా ఫలితాన్నీ రైతులకు అర్థమయ్యేలా ప్రచురించి, వారికి చేరువ చేశారు. జీవనియంత్రణ పద్ధతిలో అధిక సంఖ్యలో బదనికలు ఉత్పత్తి చేసి రైతులకు మేలు చేశారు. ఆకుతేలుపై కొత్త బదనికలను, జీవ శిలీంధ్రాలను గుర్తించారు. వీటిపై తాను చేసిన ప్రత్యేక పరిశోధనలు విజయం సాధించాయని, దాంతో రైతుల మన్ననలు పొందడమే కాక అనేక అవార్డులను పొందానని డాక్టర్‌ చలపతిరావు ‘సాక్షి’కి వివరించారు. ఈ నెల 30న వెంకటరామన్నగూడెంలో నిర్వహించనున్న విశ్వ విద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి నరసింహన్, న్యూఢిల్లీ వ్యవసాయ పరిశోధనామండలి, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ త్రిలోచన్‌ మొహపాత్రల ఆధ్వర్యంలో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డును అందుకోనున్నట్టు తెలిపారు.
మరిన్ని వార్తలు