ఎల్‌పీడీపై వీడిన అస్పష్టత

6 Feb, 2017 22:43 IST|Sakshi
ఎల్‌పీడీపై వీడిన అస్పష్టత
కంపెనీలకు మాత్రమే ఇస్తామంటూ నిబంధన
రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న సీడీబీ
కొబ్బరి సొసైటీలకు డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే 
స్పష్టం చేసిన సీపీసీఆర్‌ఐ, సీడీబీ డైరెక్టర్‌ చౌడప్ప
అమలాపురం : కొబ్బరి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన కోకోనట్‌ డవలప్‌మెంట్‌ బోర్డు (సీడీబీ) కొందరి ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందని కోనసీమ కొబ్బరి రైతులు ఆరోపిస్తున్నారు. లేయింగ్‌ అవుట్‌ ఆఫ్‌ డిమాన్‌స్ర్టేషన్‌ ప్లాంట్ల (ఎల్‌ఓడీపీ) ఎంపిక కోసం లేని నిబంధనలు ప్రవేశపెట్టిందా? అంటే అవునంటున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. సీడీబీలో లేని నిబంధనను ఇక్కడ అమలు చేసి వందలాది మంది రైతుల ప్రయోజనాలను కాలరాసిందని ఆరోపిస్తున్నారు. 
కొబ్బరి సాగుకు చేయూతనిచ్చేందుకు సీడీబీ గత కొన్నేళ్లుగా ఎల్‌ఓడీపీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో రైతుకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున రెండేళ్లపాటు ఎరువులను ఉచితంగా అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాలను మొదట క్లస్టర్ల్‌గా చేసి ఒక్కో దాని పరిధిలో 25 హెక్టార్లను ఎల్‌ఓడీపీ స్కీమ్‌ను అమలు చేశాయి. తరువాత రైతులు కోకోనట్‌ ప్రొడ్యూసర్‌ సొసైటీలగా ఏర్పడితే ఇస్తామని చెప్పింది. దీంతో కోనసీమలో వందలాది సొసైటీలు ఏర్పడ్డాయి. తరువాత నిబంధన మార్చిన సీడీబీ అధికారులు ఫెడరేషన్లుగా ఏర్పడితేనే ఎల్‌ఓడీపీ ఇస్తామని చెప్పారు. తరువాత ఈ నిబంధననూ మళ్లీ మార్చేసి కేవలం కంపెనీలుగా ఏర్పడ్డవారికి మాత్రమే ఇస్తామన్నారు. దీని వల్ల సొసైటీలకు, వాటిలోని వేలాది మంది రైతులకు ఎల్‌ఓడీపీ స్కీమ్‌ అందకుండా పోయింది.
ఈ సంఘాలను పక్కనబెట్టారు 
– ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ఠాన్నేల్లంకలో సుమారు 750 మంది రైతులు 17 సొసైటీలుగా ఏర్పడ్డారు. సీడీబీ సూచన మేరకు వీరంతా స్వామి వివేకానంద ఫెడరేషన్‌గా ఏర్పడ్డారు. రెండేళ్లు గడుస్తున్నా ఎల్‌ఓడీపీ ఇవ్వలేదు. ఇందుకు సీడీబీ అధికారులు చెప్పే కారణం వీరందరూ కలిసి కంపెనీ కాలేదని. 
– కోనసీమలో భద్రకాళీ వీరేశ్వరస్వామి (ఐ.పోలవరం), బలరామ సీపీఎఫ్‌ (బండారులంక), ఆర్ధర్‌ కాటన్‌ (అయినవిల్లి), సుజలా (అంబాజీపేట) ఫెడరేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2,500 మంది రైతులున్నారు. కొన్ని ఫెడరేషన్లు 2013లోనే సీడీబీలో రిజిస్టర్‌ అయ్యాయి. కేవలం కంపెనీలుగా ఏర్పడలేదని వీరికి కూడా ఎల్‌ఓడీపీ అందించలేదు. 
ఆ నిబంధన ఉందా?  
కంపెనీలుగా ఏర్పడినవారికే ఎల్‌ఓడీపీలో ఎరువులు ఇవ్వాలనే నిబంధన ఉందని సీడీబీ అధికారులు చెబుతుండగా, అటువంటిదేమీ లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కోనసీమలో ఒక కంపెనీ ప్రయోజనం కోసం మొదట సొసైటీలు, తరువాత ఫెడరేషన్లు, తరువాత కంపెనీలకు ఎరువులు ఇస్తామనే నిబంధనలు పెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. 
సొసైటీలకు ఎల్‌ఓడీపీ ఇవ్వాల్సిందే 
‘కోకోనట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీలకు మాత్రమే డెమోప్లాట్లు ఇవ్వాలనే నిబంధన ఏమీలేదు. సొసైటీలకు సైతం డెమోప్లాట్లు ఇవ్వాల్సిందే. మీ ఫెడరేషన్‌కు ఎందుకు ఇవ్వలేదనేదానిపై నేను చర్చిస్తాను’అని సెంట్రల్‌ ప్లాంటేషన్‌ క్రాప్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీపీసీఆర్‌ఐ), కోకోనట్‌ డవలప్‌మెంట్‌ బోర్డు (సీడీబీ)ల డైరెక్టర్‌ పాలెం చౌడప్ప చెప్పారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు దీనిపై డీసీసీబీ డైరెక్టర్, స్వామి వివేకానంద ఫెడరేషన్‌ చైర్మన్‌ గోదాశి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు రైతు సంఘం ప్రతినిధులు ముత్యాల జమ్మిలు మాట్లాడుతూ సీడీబీలో లేని ఈ నిబంధన వల్ల కోనసీమలో సుమారు ఐదు వేల మంది రైతులు ఎల్‌ఓడీపీ ప్రయోజనాలు పొందలేకపోతున్నారని వివరించగా ఆయన పై విధంగా స్పందించారు. దీనిపై తాను సీడీబీ పాలక మండలి సమావేశంలో మాట్లాడతానన్నారు. సొసైటీలకు ఎల్‌ఓడీపీలో ఎరువులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  
మరిన్ని వార్తలు