కాఫీ సాగుకు ప్రోత్సాహం

26 Jul, 2016 00:22 IST|Sakshi
 
హుకుంపేట: ఏజెన్సీలోని గిరిజన రైతులంతా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర కాఫీ బోర్డు, పాడేరు ఐటీడీఏ కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర కాఫీ బోర్డు మినుములూరు శాఖ సీనియర్‌ లైజన్‌ అధికారి (ఎస్‌ఎల్‌వో) ఎస్‌.రమేష్‌ అన్నారు. మండలంలోని మారుమూల రాప పంచాయతీ గొందిరాప, దంపులుపడప గ్రామాల పరిధిలోని గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ తోటలను సోమవారం ఆయన పరిశీలించారు.  తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పనులపై పలు గ్రామాల గిరిజన రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ రైతులంతా తమ తోటల్లోని సస్యరక్షణ పనులపై నిర్లక్ష్యం వహిస్తే దిగుబడులు  తగ్గిపోయి,  మొక్కలు చనిపోయే అవకాశం ఉందన్నారు. కలప వ్యాపారుల ఒత్తిడితో నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ చెట్లను విచ్చలవిడిగా నరికేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరారు. ఏటా కాఫీ, మిరియాల పంటల ద్వారా ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని వివరించారు. తోటల్లో నీడనిచ్చే చెట్లు, కాఫీ మొక్కల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరి రైతులంతా కాఫీతోటల్లో ఖాళీల మొక్కలను నాటుకోవాలని సూచించారు. తోటల్లో ఎండు కొమ్మలను తొలగించడంతో పాటు, పంట గింజ దశలో ఉండడంతో మొక్కలకు కాండం తొలిచే పురుగులను తొలగించాలన్నారు. తోటల్లో అడుగున్నర లోతు, నాలుగు అడుగుల వెడల్పులో ఇంకుడు గుంతలను తవ్వుకోవాలని సూచించారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా కాఫీ తోటలు సాగు చేసేందుకు ఎంపికైన రైతులు కూడా ఆగస్టు 10 నాటికి మొక్కలు నాటుకోవాలన్నారు. హుకుంపేట మండలంలోనే 800 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ మొక్కలు నాటే లక్ష్యంతో ఉన్నామన్నారు. అనంతరం ఈ ప్రాంతంలోని కాఫీ మొక్కల నర్సరీలను ఆయన పరిశీలించారు.  కార్యక్రమంలో రాప ఎంపీటీసీ సభ్యులు ఎస్‌.దర్మయ్యపడాల్, కాఫీ తోటల విస్తరణ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సెల్వరాజ్, సబ్‌ అసిస్టెంట్‌ కంకిపాటి శ్రీరాములు,ఉద్యానవన కన్సల్టెంట్‌ పి.పద్మావతి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు సీతారామ మజ్జి, శివశంకర్, లైజన్‌ వర్కర్‌ వాసుదేవుడు, రాప ఉపసర్పంచ్‌ శోభ రాంబాబుదొర, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు