కోల్డ్‌ వార్‌

11 May, 2017 01:22 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కీలక విభాగాలైన రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది. మీ కోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి తన ఆదేశాలను పాటించని 8 మంది ఎస్సైలకు జిల్లా మేజిస్ట్రేట్‌ హోదాలో అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తున్నట్టు కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ప్రకటించడం పోలీస్‌ విభాగంలో కలకలం రేపింది. తమ శాఖపై కలెక్టర్‌ పెత్తనం ఏమిటంటూ పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాకు కలెక్టర్‌ ముఖ్య అధికారి కాగా, ఆ తర్వాత స్థానం ఎస్పీదే. జిల్లాకు కలెక్టర్, ఎస్పీలు రెండు కళ్లులా వ్యవహరిస్తుంటారు. ఒకరిపై మరొకరు పెత్తనం చేసే అవసరం, అవకాశం ఎప్పుడూ రావు. అటువంటిది ఏకంగా 8 మంది ఎస్సైలకు అరెస్ట్‌ వారెంట్లు ఇస్తున్నట్టు కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటించడంపై పోలీసు శాఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేయడం కుదరదని, సివిల్‌ అంశాల్లో అన్ని విషయాలను 
పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తాము ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. క్రిమినల్‌ కేసుల్లో స్పందించినంత వేగంగా సివిల్‌ కేసుల్లో స్పందిస్తే కోర్టుల్లో ఇబ్బందులు వస్తాయని వారు అంటున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే మీ కోసం కార్యక్రమంలో వచ్చే విజ్ఞాపనలపై సాధ్యమైనంత వరకూ స్పందిసూ్తనే ఉంటామని, అయితే లిటిగేషన్‌  ఉన్న కేసుల్లో  వెంటనే స్పందించడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంపై వారు పెదవి విరుస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించాలి్సన కేసులను తమపైకి నెట్టివేసి చేతులు దులుపుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.  మీ కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి పోలీసులపై ఏ స్థాయిలో ఫిర్యాదులు వస్తాయో, జిల్లా ఎస్పీ నిర్వహించే ఫోన్‌  ఇన్‌ కార్యక్రమాలకు కూడా రెవెన్యూ విభాగంపై అదేస్థాయిలో ఫిర్యాదులు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. రెవెన్యూపై ఫిర్యాదులు వస్తే వాటిని ఆ శాఖాధికారులకు పంపి పరిష్కరించమని చెబుతామే తప్ప తాము జోక్యం చేసుకుని రెవెన్యూ అధికారులపై కేసులు పెట్టడం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తలెత్తిన వివాదం వల్ల రెండు శాఖల మధ్య అంతరం పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌  విజయవాడలో మూడు రోజులపాటు జరిగే సదస్సులో పాల్గొనడానికి వెళ్లారని, ఆయన తిరిగొచ్చాక  ఈ విషయాన్ని తెలియజేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలి్సన రెండు ప్రధాన శాఖలు ఘర్షణ వైఖరికి పోకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
 
మరిన్ని వార్తలు