ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాలు

18 Jan, 2016 01:17 IST|Sakshi
ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాలు

పండులతో ఆది నుంచీ గొల్లపల్లికి విభేదాలే..
ఇప్పుడు అదే బాటలో అయితాబత్తుల..
సయోధ్యకు రాజప్ప యత్నం విఫలం!

 
 అమలాపురం:
ఒకేపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులైనా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేస్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. వారే టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రాజోలు, అమలాపురంల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గొల్లపల్లి సూర్యారావు, అరుుతాబత్తుల ఆనందరావు. అభివృద్ధి కోసం కలిసి పని చేయూల్సిన వారు కలహించుకుంటున్నారు. ఆ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మిగిలిన ఆరు స్థానాల నుంచీ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, తోట త్రిమూర్తులు, దాట్ల బుచ్చిబాబులకు, ఎంపీ పండులకూ మధ్య సఖ్యతే ఉంది. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికీ, పండులకూ నడుమ సఖ్యత లేకున్నా పొరపొచ్చాలూ లేవు.
 
 టిక్కెట్ నాటి నుంచే..
 ఇక అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లిలకూ, పండులకూ మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా మారింది. పలుదఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గొల్లపల్లికి పార్లమెంట్‌కు వెళ్లాలనేది చిరకాల కల. ఇందుకు తగ్గట్టే.. ఎన్నికలకు ఏడాది ముందే చంద్రబాబు ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా గొల్లపల్లిని ప్రకటించారు. అరుుతే ఎన్నికలు సరిగ్గా 20 రోజులు ఉన్నాయనగా కార్పోరేట్ లాబీరుుంగ్ కారణంగా ఎంపీ టిక్కెట్ పండులకు దక్కింది. అప్పటి నుంచీ పండులపై గొల్లపల్లి వ్యతిరేకతతోనే ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా రాజోలు నియోజకవర్గంలో ఎంపీ పండుల పెత్తనం చేస్తున్నారంటూ గత నెలలో మలికిపురంలో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను సఖినేటిపల్లి మండలానికి టీడీపీ నాయకులు గొల్లపల్లి సమక్షంలోనే నిలదీశారు.
 
 దీనితో ఎంపీ అక్కడ నుంచి వెనుదిరిగారు. తాజాగా ఇలాంటి విషయంపైనే అమలాపురం ఎమ్మెల్యే  అరుుతాబత్తులకు, ఎంపీ పండులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎంపీ తమను పట్టించుకోకుండా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్నారని అయితాబత్తుల అనుచరుల ఆరోపణ. కాగా ఇటీవల ఓడలరేవులో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీని పిలవకుండా ఆనందరావు నిర్వహించడంపై ఎంపీ అనుచరులు మండిపడుతున్నారు. వీరి మధ్య విభేదాలు పెరిగిపోవడంతో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అమలాపురంలో ఆదివారం ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే ఆనందరావులను కూర్చోబెట్టి సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితానివ్వలేదని సమాచారం.
 
 కొత్తపేట ‘దేశం’ నేతలకూ కలహమే..
 పండులకు కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ ఇన్‌చార్జి బండారు సత్యానందరావులతో సైతం ఇవే విషయాల్లో విభేదాలు ఉండడం గమనార్హం. ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అవమానించినందుకు సొంతపార్టీ నేతలను ఎంపీ బహిరంగంగా తప్పుపట్టిన నాటి నుంచీ వీరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విభేదాల కారణంగా పార్టీ పరువు బజారున పడుతోందని, ఇప్పటికైనా పార్టీ పెద్దలు కలగజేసుకుని ఎంపీకి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు