‘దేశం’లో ‘ఆది’ చిచ్చు!

1 Apr, 2017 23:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య చీలిక తెచ్చింది. మొదటి నుంచి ఉన్నవారిని కాదని ఎమ్మెల్యే ఆదికి మంత్రి పదవి ఇస్తామనడంపై పార్టీ జిల్లా అధ్యక్షుడితో సహా నేతలందరూ భగ్గుమంటున్నారు. అందరూ రాష్ట్ర రాజధానిలో తిష్టవేసి ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయానికి ప్రత్యేకత ఉంది. గుండ్లకుంట వర్సెస్‌ దేవగుడి గ్రామాల మధ్య ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడిచాయి. దేవగుడి కుటుంబం వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపికైంది. ఈక్రమంలో మాజీమంత్రి, టీడీపీ నేత పి.రామసుబ్బారెడ్డి పరాజయం పాలయ్యారు. కాగా ఈమారు అధికారం టీడీపీకి దక్కింది. ఆధిపత్యం చలాయించవచ్చనే ధీమా అక్కడి టీడీపీ నేతలకు ఎంతోసేపు నిలవలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలో చేరిపోయారు. నాడు తీవ్రంగా వ్యతిరేకించిన ప్రధాన ప్రత్యర్థి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అధినేత చంద్రబాబు భరోసాతో శాంతించారు. కాగా తాజాగా మంత్రి పదవి రేసులో ఎమ్మెల్యే ఆది ముందంజలో నిలవడంతో మరోమారు తాడోపేడో తేల్చుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
భగ్గుమంటున్న నేతలు
ఎమ్మెల్యే ఆదినారాయణరెడికి మంత్రి పదవిపై జిల్లా టీడీపీ నేతలంతా మండిపడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేశారు. అంతలోనే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆది పేరు తెరపైకి రాగానే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో సహా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. పార్టీని బలోపేతం చేయాలంటే టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన రాజంపేట ఎమ్మెల్యే మేడాకి కేటాయించాలని ముక్తకంఠంతో కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని ఎమ్మెల్యే మేడా సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విజయవాడలో జిల్లా నేతలంతా తిష్టవేసి ఆదికి పీఠం ఇవ్వడంపై ఇన్‌చార్జులంతా వ్యతిరేకిస్తూ మంతనాలు చేపట్టారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మినహా తక్కిన నాయకులంతా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీని వీడేందుకు కూడా వెనుకాడేది లేదు
ఎమ్మెల్యే ఆదికి మంత్రి పదవి కేటాయిస్తే కన్నతల్లిలాంటి టీడీపీని వీడేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు విన్నవించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కేబినేట్‌ ర్యాంకు హోదా కల్గిన నామినేటెడ్‌ పదవి అప్పగిస్తానని సీఎం బుజ్జగించినట్లు సమాచారం. అందుకు ససేమిరా అనడంతో జిల్లా టీడీపీ నేతలను ఒప్పించాలని ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు టీడీపీ నేతలతో మంత్రి గంటా తన గృహాంలో తిష్టవేసి మంతనాలు జరిపారు. ఎంపీ రమేష్‌ సైతం బుజ్జగించే పనిలో ఉండిపోయారు. రాత్రి పొద్దుపోయే వరకూ వ్యవహారం కొలిక్కి రాలేదని తెలుస్తోంది. కాగా ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో సైతం టీడీపీ జమ్మలమడుగు ఇన్‌చార్జి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. అందుకు మరికొందరు నాయకులు జతకట్టడంతో వ్యవహారం జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిలతో సీఎం చంద్రబాబు మంతనాలు చేసినట్లు సమాచారం. వారు సైతం ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. ఆదికి మంత్రి పదవి కట్టబెడితే టీడీపీలో చీలికలు తప్పవని పేర్కొన్నట్లు సమాచారం.
లోకేష్‌ అభయం....
జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిసినా ఎమ్మెల్యే ఆది వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అభయం ఉందని, మరోవైపు రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు బలపరుస్తున్నారనే కారణంగా టీడీపీ నేతలను ఏమాత్రం ఖాతరు చేయలేదని సమాచారం. 2వతేదీ ఉదయం 9.22 నిమిషాలకు వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహుర్తం సైతం ఖరారైందని, పాసులు సైతం జారీ అయ్యాయని ఎమ్మెల్యే ఆది వర్గీయులు భరోసాగా ఉన్నట్లు సమాచారం. ఊహించని మలుపు తిరిగేతప్పా మంత్రి పదవి అడ్డగించే పరిస్థితులు లేవని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. కాగా నమ్మకాన్ని నట్టేట ముంచుతున్నారని, అవకాశవాదాన్ని అందలం ఎక్కిస్తున్నారని జిల్లా టీడీపీ నేతలు మదనపడుతున్నారు. ఈ పరిస్థితిలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పు సంభవించే అవకాశాలు ఉన్నాయని పలువురు వివరిస్తుండడం విశేషం.

 

మరిన్ని వార్తలు