2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలి

8 Aug, 2016 18:13 IST|Sakshi
2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలి

తెలుగు యువత రాష్ర్ట అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్‌
కందుకూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా


కందుకూరు: తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతుందని, 1982కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పాలనతో అర్థమవుతుందని తెలుగుయువత రాష్ర్ట అధ్యక్షుడు, పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి తూళ్ల వీరేందర్‌గౌడ్‌ విమర్శించారు. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ మండల అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ సుశీలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

       దేశ చట్టసభల్లో ఆమోదం పొందిన 2013 భూసేకరణ చట్టం బిల్లును కాదని రాష్ర్ట ప్రభుత్వం 123 జీఓ తీసుకొచ్చి భూములను సేకరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2013 చట్టాన్ని కాదని జీఓ 123 తేవడం చట్టసభలతో పాటు రాజ్యాంగాన్ని, రాష్ర్టపతిని అవమానించడమేనన్నారు. ఇప్పటికే 81 సార్లు కోర్టులు ప్రభుత్వ పాలనపై మొట్టికాయలు వేసినా తీరు మారలేదని ఆయన దుయ్యబట్టారు. బలవంతపు భూసేకరణను అడ్డుకుంటున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తూ వారికి రేషన్‌ నిలిపివేశారని ఆరోపించారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చేపడితే చూస్తూ ఊరుకునేదిలేదని వీరేందర్‌గౌడ్‌ హెచ్చరించారు. ఫార్మాసిటీకి చేపడుతున్న భూసేకరణ 2013 చట్టానికి లోబడే చేయాలని లేనిపక్షంలో పెద్దఎత్తున్న ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.

        మల్లన్నసాగర్‌లో మాదిరి ఇక్కడా రైతులు తిరగబడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే 123 జీఓను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ ఈ.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముచ్చర్ల సర్వే నంబర్‌ 288లోని సర్టిఫికెట్‌దారులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేపట్టడం దారుణమన్నారు. భూములు లేని వారికి మూడు ఎకరాల చొప్పున ఇస్తామని చెప్పిన సర్కార్‌.. సర్టిఫికెట్‌దారులను విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు జగదీష్‌బాబు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు సంధ్యాసల్మోహన్‌రెడ్డి, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, పర్వతాలు, సంజీవ, జాన్యానాయక్‌, సర్పంచ్‌ కాస నర్సింహా, ఎంపీటీసీ ఎం.నర్సింహా, నాయకులు అచ్చన పాండు, ఎగ్గిడి కృష్ణ, రవిగౌడ్‌, శేఖర్‌గౌడ్‌, యాదయ్య, ప్రవీణ్‌నాయక్‌, రాంరెడ్డి, వెంకటచారి, శాం‍్యసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు