వసూళ్ల వెలుగులు!

16 Nov, 2016 22:51 IST|Sakshi
వసూళ్ల వెలుగులు!
– పెద్ద నోట్ల రద్దుతో ముందస్తు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు
– నెల బిల్లు కంటే వంద రెట్లు అధికంగా చెల్లిస్తున్న వినియోగదారులు
– కలెక‌్షన్‌ అంతా రూ.500, రూ.వెయ్యి నోట్లే
– 11న ఒకే రోజు రూ. 9.98కోట్లతో రికార్డు
– నెలనెలా బిల్లులో మైనస్‌ అవతుందని ధీమా
 
కర్నూలు(రాజ్‌విహార్‌): కర్నూలు నగరంలోని బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న ఓ వినియోగదారుడికి ఈనెల రూ.1,074 విద్యుత్‌ బిల్లు వచ్చింది. అయితే ఆయన మంగళవారం ఆశాఖకు రూ.1,00,000 చెల్లించాడు. అంతారూ.వెయ్యి నోట్లతోనే. మీ బిల్లు రూ.1,074లే కదా.. రూ.లక్ష కడుతున్నారేంటి? అని పవర్‌ హౌస్‌లోని కౌంటరు ఉద్యోగి ప్రశ్నించగా.. మా ఇష్టమండి.. అడ్వాన్స్‌గా చెల్లించవచ్చని అధికారులే ప్రకటన ఇచ్చారు. మీరు అడగడమేంటి అని సమాధానం ఇవ్వడంతో ఆడబ్బును తీసుకొని రసీదు ఇచ్చారు. దీంతో ఈ లెక్కన దాదాపు 8 ఏళ్ల వరకు ఆయన బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
 
  •  కల్లూరు ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లోని ఓ పరిశ్రమకు నెలవారి బిల్లు దాదాపు రూ.8వేలు వస్తుంది. కాని ఆ పరిశ్రమ యజమాని ఇటీవలే రూ.6లక్షల నగదును చెల్లించాడు'. 
.. వీరిద్దరే కాదు. ఇలా కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేలాంది మంది వినియోగదారులు తమకు వచ్చిన విద్యుత్‌ బిల్లు కంటే వందరెట్లు అధికంగా చెల్లిస్తున్నారు. అదంతా రూ.500, రూ.వెయ్యి నోట్లతోనే.
       నెలవారి బిల్లులు సకాలంలో చెల్లించండయ్యా బాబు అని ఆశాఖ అధికారులు నెత్తినోరు కొట్టుకున్నా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేసే వినియోగదారులు ఇప్పుడు కౌంటర్ల వైపు పరుగుతీస్తున్నారు. రద్దయిన పెద్ద నోట్లతో విద్యుత్‌ బిల్లులు కట్టవచ్చని, అదీ పాత బకాయిలతోపాటు ముందస్తు (అడ్వాన్స్‌) చెల్లింపులు చేయవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించడంతో రూ.వెయ్యి, రూ.500 నోట్లతో కేంద్రాల వద్ద కివ్‌∙లైనులో నిలబడి కట్టేస్తున్నారు. వచ్చిన బిల్లులు పక్కనపెడితే కొందరు వంద రెట్ల వరకు అధికంగా చెల్లిస్తున్నారు. తరువాత ఎలాగూ నెలనెలా బిల్లులో మైనస్‌ అవతుందని ధీమాతో రద్దయిన పాత పెద్ద నోట్లను ఇలా చెలామని చెసుకుంటున్నారు. దీంతో ఆశాఖ ఖజానా రూ.500, రూ.వెయ్యి నోట్లతో నిండిపోతోంది. ఈనెల 8తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు పెద్ద నోట్ల స్వీకరణకు అనుమతి లేకపోవడంతో రోజుకు కేవలం లక్షల్లోనే ఆదాయం వచ్చింది. పాత నోట్లతో విద్యుత్‌ బిల్లులు చెల్లించవ్చని ప్రకటించడంతో 11వ తేదీన ఒకే రోజు రూ.9.98కోట్ల రికార్డు స్థాయి కలెక‌్షన్‌ వచ్చింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు కట్టడంతో సంస్థ, జిల్లా చరిత్రలోనే మొదటి సారి అని అధికారులు పేర్కొంటున్నారు. గత ఆరు రోజుల్లో రూ.22 కోట్ల రద్దయిన రూ.500, రూ.వెయ్యి నోట్లతో బిల్లులు కట్టగా వాటిలో ఎల్‌టీ (గృహాలు, షాపులు, చిన్న ఫ్యాక్టరీలు) రూ.15.61కోట్ల కట్టగా పారిశ్రామికులు రూ.6.39కోట్ల చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలివైన వినియోగదారులు తమ డబ్బులు ఇలా తెలుపు చేసుకుంటున్నారు.
 
– గత ఎమినిది రోజుల కలెక్షన్‌ ఇలా..
తేదీ ఎల్‌టీ హెచ్‌టీ మొత్తం
9వ తేదీన రూ.52.41లక్షలు రూ.9.79లక్షలు రూ.62.20లక్షలు
10వ తేదీన రూ.42.04లక్షలు రూ.44.85లక్షలు రూ.86.89లక్షలు
11వ తేదీన రూ.5.79కోట్లు రూ.4.18కోట్లు రూ.9.98కోట్లు
12వ తేదీన రూ.2.15కోట్లు రూ.9.11లక్షలు రూ.2.24కోట్లు
13వ తేదీన రూ.1.69కోట్లు రూ.13.12లక్షలు రూ.1.82కోట్లు
14వ తేదీన రూ.3.23కోట్లు రూ.31.88లక్షలు రూ.3.54కోట్లు
15వ తేదీన రూ.1.63కోట్లు రూ.19.29లక్షలు రూ.1.82కోట్లు
16వ తేదీన రూ.1.12కోట్లు రూ.51.20లక్షలు రూ.1.63కోట్లు
 
మరిన్ని వార్తలు