ఎమ్మెల్యేకు విందు పేరుతో వసూళ్లు!

8 Nov, 2016 23:54 IST|Sakshi
బందార్లపల్లె క్రాస్‌ రోడ్డు సమీపంలో నిలిపిన ట్రాక్టర్లు
- ఇవ్వని ట్రాక్టర్‌ యజమానికి రాయల్టీలు ఇవ్వకుండా సతాయింపు
- అధికార పార్టీ మద్దతు దారుల అక్రమ దారి
 
కొలిమిగుండ్ల: ‘నాపరాతిపై పెంచిన రాయల్టీ ధరను ప్రభుత్వంతో పోరాడి ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి తగ్గించారు..అందుకు ప్రతిగా పెద్ద ఎత్తున డిన్నర్‌(విందు) ఏర్పాటు చేస్తున్నాం. యజమానులందరూ రూ.2వేల చొప్పున ఇవ్వాల్సిందే’ అని అధికార పార్టీ మద్దతు దారులు మంగళవారం నుంచి వసూళ్ల పర్వం మొదలు పెట్టినట్లు సమాచారం. 2015 నవంబర్‌లో రాయల్టీ బిల్లుపై 4నుంచి 8శాతం ధర ప్రభుత్వం పెంచింది. ఇటీవల ఆ ధరను ప్రభుత్వం 5శాతానికి తగ్గిస్తూ జీఓ జారీ చేసింది. ఈనేపథ్యంలో నాయకులు డిన్నర్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. కొలిమిగుండ్ల, అవుకు మండలాల నుంచి రోజు బందార్లపల్లె క్రాస్‌ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్ట్‌ మీదుగా 650కు పైగా ట్రాక్టర్లు నాపరాళ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటాయి. ట్రాక్టర్‌తో పాటు మైనింగ్‌ లీజు దారులు, రాయల్టీ బిల్లులు విక్రయించే వారు ఒక్కొక్కరు రూ.2వేలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసూలు చేసే బాధ్యత రాయల్టీ బిల్లులు విక్రయించే వారికి అప్పగించినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే ట్రాక్టర్లకు రాయల్టీలు ఇవ్వరాదని గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. ఓ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడుకి చెందిన ట్రాక్టర్‌కు డబ్బు ఇవ్వాలని పేర్కొనడంతో ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరి కొందరు యజమానులు మాత్రం సమస్య ఎందుకని అడిగిన మొత్తం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అధికార పార్టీ నాయకులు డిన్నర్‌ ఇచ్చుకోవాలంటే ఇలా పది మందితో బలవంతంగా వసూలు చేయకుండా సొంతంగా ఖర్చు పెట్టుకోవాలని పలువురు యజమానులు హితువు పలికారు.  
 
>
మరిన్ని వార్తలు