-

ప్రజాసేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి

12 Feb, 2017 21:54 IST|Sakshi
ప్రజాసేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి

అనంతపురం అర్బన్‌ : ‘‘ఐఏఎస్‌ అధికారులుగా ప్రజలకు సేవలు అందించండి... అందులోనే నిజమైన సంతృప్తిని పొందుతారు.’’ అని కలెక్టర్‌ కోన శశిధర్‌ స్టడీ టూర్‌కి వచ్చిన శిక్షణ ఐఏఎస్‌ అధికారులకు సూచించారు.  వింటర్‌ స్టడీ టూర్‌లో భాగంగా జిల్లాలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 2016 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌లు జిల్లాకు వచ్చారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ట్రైనీ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌తో కలిసి శిక్షణ ఐఏఎస్‌లతో కలెక్టర్‌ శశిధర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వారికి జిల్లా భౌగోళిక స్వరూపం, నెలకొన్న కరువు, తద్వారా ఉత్పన్నమైన పరిస్థితులు, కరువు నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాల గురించి వారికి వివరించారు.

గత 18 సంవత్సరాల్లో 13 ఏళ్లు కరువు బారిన పడటంతో ప్రజలు నిరంతరం సంఘర్షణతో జీవిస్తున్నారని కలెక్టర్‌ చెప్పారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారని, అధికార యంత్రాంగాన్ని గౌరవించడంలో ముందుంటారని తెలిపారు.  స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను కూడా వివరించారు. జిల్లాను కరువు బారి నుంచి గట్టెక్కించేందుకు హంద్రీ–నీవా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు.  జిల్లా నీటి పారుదల ప్రణాళిక ద్వారా జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇక.. కర్బుజ, కళింగర, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ పంటలకు జిల్లా ప్రసిద్ధిగాంచిందని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని చారిత్రాత్మక అంశాల గురించి ట్రైనీ కలెక్టర్‌ వివరించారు. నీటి సంరక్షణ, స్వచ్ఛ విద్యాలయ్‌ కార్యక్రమాల గురించి  డ్వామా పీడీ నాగభూషణం, ఎస్‌ఎస్‌ఏ పీఓ దశరథరామయ్య తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈఓ రామచంద్ర, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు