కలెక్టర్, ఎస్పీ హాజరు కావాల్సిందే..

29 Mar, 2016 03:01 IST|Sakshi

అంబేడ్కర్ విగ్రహం తొలగింపుపై
తాజాగా సమన్లు జారీ
మార్చి 31న విచారించనున్న
జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్
రెవిన్యూ సెక్రెటరీకి సైతం సమన్లు

 సాక్షి ప్రతినిధి, కడప: నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో అంబేడ్కర్ విగ్రహం తొలిగింపు వ్యవహారంలో స్వయంగా తమ ఎదుట హాజరు కావాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తాజాగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఇది వరకు జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ హాజరైన నేపథ్యంలో ప్రత్యేకించి కలెక్టర్, ఎస్పీలతో పాటు రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సైతం సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు  మార్చి 31న స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్ పుణియా నుంచి జిల్లా కేంద్రానికి సమన్లు చేరాయి. నూతన కలెక్టరేట్‌లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చాలా కాలంగా కోరుతున్నాయి.

ఈ క్రమంలో డిసెంబర్ 30న కలెక్టరేట్‌లో అనూహ్యంగా అంబేడ్కర్ విగ్రహం వెలిసింది. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం చట్టసమ్మతం కాదని జిల్లా యంత్రాంగం అదేరోజు రాత్రి పొద్దుపోయాక విగ్రహాన్ని తొలగించింది. ఆపై అక్కడే తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమించాయి. అనంతరం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ కమలమ్మకు రాయలసీమ ఎస్సీ, ఎస్టీ హ్యుమన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు జెవి రమణ ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూలగొట్టడమే కాకుండా, విగ్రహం కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను సైతం కూల్చివేశారని వివరించారు. కూలగొట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారో కూడా తెలియదని, ఈ వ్యవహారంతో ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవహ దెబ్బతినిందని, ఇందుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ ఫిర్యాదును కమలమ్మ చైర్మన్ పుణియాకు అందజే శారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కెవి రమణ, ఎస్పీ నవీన్ గులాటీలు జనవరి 28న కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే జనవరి 28 కలెక్టర్ స్థానంలో జాయింట్ కలెక్టర్ శ్వేత, అడిషనల్ ఎస్పీ విజయకుమార్‌లు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ గైర్హాజర్ కావడంపై కమిషన్ మెంబర్ కమలమ్మ సీరియస్ అయ్యారు. సమస్యకు మూలమైన అధికారులు హాజరు కాకపోవడమేమిటని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు సర్ది చెప్పినా..

అన్ని ప్రాంతాల్లో అవే నిబంధనలు ఎందుకు వర్తింప చేయలేదని నిలదీశారు. అంబే డ్కర్ విగ్రహం తొలగింపులోనే ఎందుకు ఉత్సాహం చూపారని నాడు నిలదీస్తూ విచారణ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్చి 31న కలెక్టర్ కెవి రమణ, ఎస్పీ నవీన్ గులాటీ, రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ అయ్యాయి. కలెక్టర్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడికి సైతం సమన్లు జారీ అయినట్లు రాయలసీమ ఎస్సీ, ఎస్టీ హ్యుమన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు జెవి రమణ ధ్రువీకరించారు.

మరిన్ని వార్తలు