కాల్‌మనీ వ్యాపారులపై ఉక్కుపాదం

5 Jul, 2016 10:12 IST|Sakshi

ఏలూరు: జిల్లాలో రూ.5, రూ.10 వడ్డీలతో ప్రజలను దోపిడీ చేసే కాల్‌మనీ వ్యాపారులను అరెస్ట్ చేసి బాధితులకు ఉపశమనం కల్పించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మీ కోసం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.

ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన కొక్కిరపాటి ఎస్తేరమ్మ  వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలోని మంతెన కనకరత్నం దగ్గర నూటికి ఐదు శాతం చొప్పున తాను తీసుకున్న రూ.40 వేలను 35 సంవత్సరాలుగా దఫాదఫాలుగా పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా బాకీ చెల్లించాల్సి ఉందని చెబుతూ తమకు ఇవ్వాల్సిన ప్రాంశరీ నోట్‌లను ఇవ్వడం లేదని, అడిగితే తిట్టడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. అదే గ్రామానికి చెందిన సిరిమామిళ్ల తాయారమ్మ, గుంటాన గంగమ్మలు కూడా 30 సంవత్సరాలుగా తాము చెల్లించాల్సిన సొమ్ములు దఫదఫాలుగా చెల్లించినప్పటికీ మంతెన వెంకటరత్నం ప్రాంసరీ నోట్లు ఇవ్వకుండా అప్పు ఇంకా తీరలేదంటూ దౌర్జన్యంపై చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ స్పందిస్తూ కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల ఆగడాల వల్ల ఎంతోమంది పేదల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయని, ఎక్కువ శాతం వడ్డీలతో పేద ప్రజలను పీడిస్తూ కొంతమంది మరణాలకు కూడా కారణమవుతున్నారని, అటువంటి వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ఉక్కుపాదం మోపి కఠినంగా అణచివేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివిధ సమస్యలపై పలువురు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించగా వాటిని పరిశీలించిన ఆయన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు