పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చేయాలి

5 Aug, 2017 23:31 IST|Sakshi
పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ : పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీవో దినేష్‌కుమార్, స్పెషల్‌ కలెక్టర్‌ భానుప్రసాద్, సంబంధిత ఆర్డీవోలతో సమీక్షించారు. నిర్వాశితులకు పునరావాసంలో భాగంగా 21 కాలనీలు చేపట్టాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు ఏడు కాలనీలు నిర్మించడం జరిగిందని, మరో 9 కాలనీలకు లే అవుట్‌లు సిద్ధం చేశారని కలెక్టర్‌ తెలిపారు.  ఎటపాక డివిజన్‌లోని గ్రామాలలో అదనపు భూసేకరణ పనులను కూడా కలెక్టర్‌ సమీక్షిస్తూ, ఈ భూసేకరణ పనులు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌పై ప్రతీ సోమవారం సమీక్షించడం జరుగుతుందన్నారు. భూమికి బదులు భూమి పథకం కింద అవార్డ్‌పాస్‌ చేసిన 443 ఎకరాల భూమిని ఐటీడీఏకు అక్టోబర్‌ 31లోగా అందజేయాలని, ఈ భూమి ఐటీడీఏ రైతులకు, టైటిల్‌ డీడ్, పట్టాదారు పాస్‌పుస్తకంతో కలిపి నవంబర్‌ 30వ తేదీలోగా అందజేయాలని కలెక్టర్‌ సూచించారు. అదేవిధంగా ఈ భూములకు అవసరమైన రోడ్లను ఉపాధి హామీ సమన్వయం ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. 
పట్టుదల, కృషితో పనిచేసి ఉత్తమ ఫలితాలు 
దివ్యాంగులకు ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేయడం జరిగిందని, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్న దివ్యాంగులు పట్టుదల, కృషితో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ కోర్టుహాలులో వికలాంగుల సంక్షేమశాఖ నిర్వహించిన బ్యాక్‌లాగ్‌ పోస్టులభర్తీలో ఎంపికైన వారితో కలెక్టర్‌ ముఖాముఖిగా మాట్లాడారు. ఎంపికైన అభ్యర్థులను అభినందిస్తూ మనోధైర్యంతో పనిచేస్తే అంగవైకల్యంను అధిగమించవచ్చని హితవుపలికారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ కేవీవీ సత్యనారాయణ, ఎంపికైన అభ్యర్థులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు