ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడొద్దు

15 Jun, 2017 23:10 IST|Sakshi
ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడొద్దు
కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
కాట్రావులపల్లిలో పంట కాల్వ పనులు పరిశీలన 
గ్రామంలో హైస్కూల్‌ తనిఖీ 
హౌసింగ్‌ స్కీమ్‌ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి భూమి పూజ 
జగ్గంపేట : ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. జిల్లాలో కాకినాడ రూరల్‌ నుంచి పిఠాపురం, గొల్లప్రోలు, శంకవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర మండలాలలో గురువారం ఉదయం నుంచి ప్రభుత్వ పథకాల తీరుని పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన చేసిన ఆయన మండలంలోని కాట్రావులపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామ పరిధిలో పెద్దాపురం రోడ్డును ఆనుకుని పంట కాల్వ పూడిక తీత పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఉపాధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని సిబ్బందికి సూచించారు. ఏపీఓ ఇచ్చిన నివేదిక చూసి పనులు శాతం ఇతర మండలాల కన్నా తక్కువగా ఉందని ఎక్కువ పనులు కల్పించి కూలి ఎక్కువ వచ్చేలా చూడాలన్నారు. 
 అనంతరం సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను ప్రశ్నించగా కొద్ది మంది మాత్రమే తిన్నట్టు తెలిపారు. హెచ్‌ఎం చౌదరి స్పందించి వేసవి సెలవులు తరువాత సోమవారం నుంచి బడులు తీయడంతో హాజరు తక్కువగా ఉన్నందున 20 మందికి భోజనం పెట్టామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీల గురించి ప్రశ్నించగా 24 మంది ఉన్నారని, డ్రాయింగ్‌ టీచర్‌ పోస్టు ఖాళీగా ఉందన్నారు. 300 మంది విద్యార్థులు ఉన్నారని హెచ్‌ఎం తెలిపారు. విద్యాబోధన, గేమ్స్, విద్యార్థులకు వస్తున్న మార్కులు తదితర వాటి గురించి ఉపాధ్యాయులను కలెక్టర్‌ ఆరా తీశారు. అక్కడ నుంచి గ్రామంలోని ఎస్సీపేట చేరుకుని ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నేతిపూడి చంటి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నేతిపూడి వెంకటరమణ ఇంటిని ప్రారంభించారు. హౌసింగ్‌ పీడీ ప్రసాద్, డీఈఈ వేణుగోపాలరావులను లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒక బాలుడిని ఆపి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వేశ్వరరావు, డ్వామా పీడీ రాజకుమారి, ఎంపీడీఓ వాసుదేవరావు, ఏపీఓ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు