పుష్కరఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్‌

3 Aug, 2016 23:39 IST|Sakshi
పుష్కరఘాట్‌ను పరిశీలించిన కలెక్టర్‌
ఊట్లపల్లి(పెద్దవూర): మండలంలోని ఊట్లపల్లి పుష్కరఘాట్‌ను బుధవారం కలెక్టర్‌ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. పుష్కరఘాట్‌ నిర్మాణ పనులను జూలై 25 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ  ఇంకా పూర్తి చేయకపోవడం పట్ల గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా పనుల వారిగా విభజించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఘాట్‌కు వచ్చే భక్తులకు బావి నుంచి కాకుండా 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న నది బ్యాక్‌ వాటర్‌ నుంచి పైపుల ద్వారా నీటిని తీసుకువచ్చి షవర్‌ బాత్‌కు అనుసందానించాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా నిరంతరం ఉండేవిధంగా చూడాలని సంబంధిత ఎస్‌ఈని ఫోన్‌లో ఆదేశించారు. విద్యుత్‌ దీపాలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. నాగార్జునసాగర్‌కు రద్దీ ఎక్కువైతే ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఊట్లపల్లి పుష్కరఘాట్‌కు పంపించే యోచనలో ఉన్నట్లు దీనికి అనుగుణంగా పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ఘాట్ల వద్దనే ఉండి పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరిత గతిన పూర్తి చేయటానికి కృషి చేయాలని అన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ రావుల మహేందర్‌రెడ్డి, డిండి రిజర్వాయక్‌ డిప్యూటీ కలెక్టర్, ఘాట్‌ ప్రత్యేక అధికారి ప్రభాకర శ్రీనివాసన్, ఐబీ ఎస్‌ఈ ధర్మానాయక్, తహసీల్దార్‌ పాండునాయక్, ఎంపీడీఓ రఫిఖున్నీసా, పీఆర్‌ ఏఈ వెంకటేశ్వర్లు, ఏపీఓ గోపాల్‌రెడ్డి, మేరెడ్డి జైపాల్‌రెడ్డి, గడ్డంపల్లి వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు