పచ్చచొక్కా వేసుకుని పని చేస్తున్నాడు

27 Sep, 2016 23:27 IST|Sakshi
పచ్చచొక్కా వేసుకుని పని చేస్తున్నాడు
– కలెక్టర్‌పై రాజకీయ, ప్రజాసంఘాల నేతల ఆగ్రహం
– నేడు కలెక్టరేట్‌ వద్ద ధర్నా
 
 కర్నూలు సిటీ: జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు అండగా నిలవాల్సిన కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేయకూడదని నిషేధం విధించడంపై మంగళవారం నంద్యాల చెక్‌ పోస్టు సమీపంలో వామ పక్ష పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రసూల్, సీపీఎం నగర నాయకులు రాజశేఖర్‌లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌ మాణిక్యం, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గోవిందు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు దండు శేషు యాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దయ్య, తోట క్రిష్ణారెడ్డి ప్రసంగించారు. విజయమోహన్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు వినతులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉందని, దీన్ని కలెక్టర్‌ అణిచి వేయాలనే ధోరణిలో వ్యవహారిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను వదిలేసి కలెక్టరేట్‌ను అధికారి పార్టీ కార్యాలయంగా మార్చుతున్నారని ఆరోపించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేయకుడదని నిషేధించడం అప్రజాస్వామ్యమని, ఆ బోర్డును తొలగించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. 
 
>
మరిన్ని వార్తలు