'రంగుల' కలలు !

18 May, 2016 08:10 IST|Sakshi
'రంగుల' కలలు !

* అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రంగురాళ్ల వేట
* దాచేపల్లి మండలం శంకరాపురం అడవుల్లో యథేచ్ఛగా తవ్వకాలు
* పగలు, రాత్రి తేడా లేకుండా 20 అడుగుల లోతు సొరంగాలు
* హైదరాబాద్ దళారీల ద్వారా రాజస్థాన్‌కు అక్రమ రవాణా
* పట్టనట్టు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు
* తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు ఓ కూలీ మృతి ?

సాక్షి, గుంటూరు : అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్న  టీడీపీ  నేతలు ఇప్పుడు అటవీ ప్రాంతాలపైనా కన్నేశారు.

కడప, కర్నూలు, చిత్తూరు వంటి జిల్లాల్లో అక్కడి అధికార పార్టీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతుండగా, ఇక్కడ ఆ అవకాశం లేక తెలుగు తమ్ముళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పల్నాడులోని దాచేపల్లి, బెల్లంకొండ వంటి ప్రాంతాల్లో అటవీ భూముల్లో  రంగురాళ్ల వేట సాగిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు దళారుల సహాయంతో తవ్వకాల్లో లభ్యమైన రంగురాళ్ల ముడిసరుకును నేరుగా రాజస్థాన్‌కు అక్రమ రవాణా చేస్తూ రూ. లక్షలు గడిస్తున్నారు.

పోలీసు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సైతం ఆ వైపు తిరిగి చూడడం లేదు. నెలనెలా మామూళ్లు తీసుకుంటూ తమకేమీ తెలియనట్లు నిద్రనటిస్తున్నారు.  అధికార పార్టీనేతలు దాచేపల్లి మండలం భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాల నిరుపేద కూలీలను తవ్వకాలకు వినియోగిస్తూ వారికి కొద్దిగా ముట్టజెబుతూ భారీఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు.
 
బృందాలుగా ఏర్పడి తవ్వకాలు...
దాచేపల్లి మండలం శంకరాపురం సమీప అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా భట్రుపాలెం, కాట్రపాడు, శంకరాపురం గ్రామాలకు చెందిన కూలీలు గ్రూపులుగా ఏర్పడి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ గ్రూపులన్నీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతల కనుసన్నల్లోనే అటవీ ప్రాంతంలో రంగు రాళ్ల వేట జరుపుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా శంకరాపురం అడవుల్లో 15 నుంచి 20 అడుగుల లోతు సొరంగాలు తవ్వుతూ  వేట సాగిస్తున్నారు.  

రంగు రాళ్ల ముడిరాయి అధికంగా దొరుకుతుండడంతో రోజురోజుకు తవ్వకాలను ఉధృతంం చేస్తున్నారు. ఇక్కడ రంగురాళ్లతోపాటు, బంగారు ఆభరణాల్లో ఉపయోగించే ఖరీదైన జాతిరాళ్లు సైతం దొరుకుతుండడంతో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. అధికార పార్టీ నేతలు హైదరాబాద్‌కు చెందిన కొందరు దళారుల ద్వారా రంగు రాళ్ల ముడిసరుకును ముక్కలుగా చేసి రాజస్థాన్‌కు ఎగుమతి చేస్తూ లక్షలు గడిస్తున్నారు.
 
అన్నీ తెలిసినా అటువైపు చూడని అధికారులు
 అటవీ ప్రాంతంలో రంగురాళ్ల కోసం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయం అక్కడి పోలీసు అధికారులు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులందరికీ తెలిసినప్పటికీ నిలువరించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.  అటవీ ప్రాంత తండాల్లో మంచినీరు  బోరువేసుకోవాలన్నా నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టే అటవీశాఖ అధికారులు రంగురాళ్ల తవ్వకాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల రూ.15 నుంచి రూ.20 లక్షల విలువచేసే రంగురాళ్ల మూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా తవ్వకాల్లో ఓ కూలి ప్రమాదవశాత్తు మృతి చెందిగా, దాన్ని  బయటకు పొక్కనీయకుండా అంత్యక్రియలు కానిచ్చేశారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
 
స్పెషల్ ఫోర్స్‌ను నియమించాం..
దాచేపల్లి మండలం శంకరాపురం వద్ద అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకా లు జరుగుతున్న విషయం వాస్తవమే. రాత్రి పూట అధిక సంఖ్యలో కూలీలు అటవీ ప్రాంతానికి చేరుకుని తవ్వకాలు జరుపుతున్న విషయం నా దృష్టికి వ చ్చింది. భారీస్థాయిలో గుంతలు ఏర్పడడంతో పొక్లయిన్‌ల ద్వారా వాటిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. స్థానిక పోలీసుస్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు కూడా చేశాం. మావైపు నుంచి కూడా స్పెషల్ ఫోర్స్‌ను నియమించి రంగురాళ్ల తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.           
- కె. మోహన్‌రావు, డీఎఫ్‌వో (టెరిటోరియల్)

మరిన్ని వార్తలు