గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం వచ్చి..

25 Sep, 2016 12:45 IST|Sakshi
గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం వచ్చి..
  • మానుకోటలో దొంగతనాలకు పాల్పడిన యువకుడి అరెస్ట్‌ 
  • 16 తులాల బంగారు 
  • ఆభరణాలు స్వాధీనం
  • నిందితుడు పాత నేరస్తుడే 
  • బాల్యం నుంచే చోరీల బాట
  • మహబూబాబాద్‌ : అతడో గజ దొంగ.. ఇంటికి కన్నం వేశాడంటే బీరువాలో ఉన్నదంతా దోచేయాల్సిందే. బాల్యం నుంచే చోరీల్లో ఆరితేరిన ఈ దొంగకు ఇటీవల మానుకోటకు చెందిన ఓ అమ్మాయి పరిచయం కావడంతో ఇక్కడి ఇళ్లపై అతడి కన్నుపడింది. ఆమెను కలిసేందుకని వచ్చిన అతడు ఇక్కడ కూడా తన చోరకళ ప్రదర్శించా డు. మూడు ఇళ్లలో ఏకంగా రూ.5 లక్షల విలువైన ఆభరణాలు అపహరించి పట్టణవాసులను హడలెత్తించాడు. చివరికి శనివారం పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

    స్థానిక టౌన్‌ పోలీస్‌స్టేన్‌లో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.రాజమహేంద్ర నాయక్‌ చోరీ వివరాలను వెల్లడించారు. ఖమ్మంకు చెందిన బొల్లిశెట్టి శ్రీనివాస్‌ అలియాస్‌ బన్ను ప్రస్తుతం  సత్తుపల్లిలోని తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటుపడిన ఇత డు మైనర్‌గా ఉన్నప్పుడే మూడుసార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అతడికి మానుకోటకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడడంతో తరచూ ఇక్కడికి వస్తుండేవాడు.
     
    ఈ క్రమంలోనే అతడు పట్టణంలోని బుక్క బజార్‌కు చెందిన కొదుమూరి శివకుమార్‌ ఇంట్లో 12 తులాల బంగా రు ఆభరణాలు(హారం, నక్లెస్, బ్రాస్‌లైట్, టైటాన్‌వాచ్, ఇతరత్ర), రాంచంద్రాపురం కాలనీలోని బానోత్‌ భీముడు ఇంట్లో 10 గ్రాముల(చెవుల కమ్మలు) బంగారం, బెస్తబజార్‌లోని డోలి అరుణ ఇంట్లో రెండు తులా ల బంగారు ఆభరణాలను అపహరించాడు. ఈ క్రమంలో శనివారం అతడు మానుకోటలో మళ్లీ చోరీలకు పాల్పడేందుకు వస్తుండగా పట్టణ శివారులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం సమీపంలో టౌన్‌సీఐ నందిరామ్‌ నాయక్, సిబ్బం ది శనివారం వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీల విషయం వెల్లడించాడు.
     
    ఆ ఆభరణాలను రైల్వే ఓవర్‌బ్రిడ్జి కిందలో గుంతలో దాచిపెట్టినట్లు అతడు చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని గురునాథం ఇంట్లో కూడా చోరీకి పాల్పడగా ఆ బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో  టౌన్‌ సీఐ నంది రామ్‌ నాయక్, ఎస్సైలు ప్రసాద్‌రావు, తిరుపతి, కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు. 
>
మరిన్ని వార్తలు