నెల్లూరు రావడం చిరకాల కోరిక

17 Jun, 2016 04:14 IST|Sakshi
నెల్లూరు రావడం చిరకాల కోరిక

కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్
 
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): భారతీ య జనతాపార్టీతో సుదీర్ఘ అనుబంధంగల నెల్లూరుకు రావడం చిరకాల కోరికని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.  గురువారం స్థానిక రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరంలో ఎలైట్‌మీట్‌లో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం మంది కాంట్రాక్టర్లు, 70 శాతం మంది ఇంజనీర్లు దక్షిణ ప్రాంతం వారని ఆయన ప్రశంసించారు. ఐఐటీ చదివే రోజుల్లో తన మిత్రుడు చేసిన వ్యాఖ్యలను వివరించారు. ప్రధాన మంత్రి మోదీ విదేశీ పర్యటన వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి సూపర్‌పవర్‌గా గుర్తింపు వచ్చిందన్నారు. సామర్థ్యానికి గుర్తింపు వస్తే అదే  అభివృద్ధి అని పేర్కొన్నారు.


గోవాలో గాయకులు గోవాకే పరిమితమై పాడుతుంటే గుర్తింపు, అభివృద్ధి లేదన్నారు. అదే వ్యక్తులు లతామంగేష్కర్, ఆశ బోంస్లేలు ముంబయికి వెళ్లి వ్యక్తిగతంగా అభివృద్ధి, దేశవ్యాప్త ఖ్యాతిని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోదీ పాలన ముఖ్యాంశాలను వివరించారు. అనంతరం ప్రజల ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో విపత్కర పరిస్థితుల్లోనే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితులను, నైపుణ్య పని సామర్థ్యాలతో ఎదుర్కోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.


న్యాయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా తనవంతు సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. నెల్లూరులో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ) ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థల ఏర్పాటును వివరించారు. రాష్ట్రంలో డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. సుదీర్ఘమైన కోస్తా తీరంలోని మత్స్యకారులతో సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటుచేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అవినీతి నిర్మూలన చర్యలు నిదానంగా సాగడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. దానిపై న్యాయవ్యవస్థ తన పాత్రను పోషిస్తుందన్నారు. పెట్రోల్ ధరల పెంపుపై స్పందిస్తూ తక్కువ స్థాయిలోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్నారు.


 కృష్ణుడు, శివాజీ స్ఫూర్తి

 పురాణాల్లో కృష్ణుడు, చరిత్రలో శివాజీ స్ఫూర్తి అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే రాజకీయాల్లో ప్రవేశించడానికి కారణానికి వరదనీటి ప్రవాహంలో కొట్టుకోపోతున్న వ్యక్తిని కాపాడేందుకు కథను వివరించారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కె.హరిబాబు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దినేష్‌శర్మ, బీజేపీ నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు