రాష్ట్రాల హక్కులు పరిరక్షించాలి

2 Nov, 2016 22:52 IST|Sakshi
రాష్ట్రాల హక్కులు పరిరక్షించాలి

విజయవాడ (మధురానగర్‌) : రాబోయే వస్తు సేవల పన్ను విధానంలో కేంద్రం ఏకపక్ష ధోరణి విడనాడి రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే విధానంలో వ్యవహరించాలని, సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో అఖిల భారత వాణిజ్య పన్ను శాఖల సమాఖ్య ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను నిరసిస్తూ బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వస్తు సేవల పన్ను చట్టాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలతో కలిపి అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే కేంద్రం రాష్ట్రాల అధికారాలను పూర్తిగా తన వద్దే ఉంచుకుని రాష్ట్రాలను బలహీనపరుస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రాల్లోని వాణిజ్య పన్నుల శాఖలు అలంకారప్రాయంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. సంఘ ఉఫాద్యక్షుడు మెహర్‌కుమార్, విజయవాడ ఒకటవ డివిజన్‌ డెప్యూటీ కమిషనర్‌ వై.కిరణ్‌కుమార్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.గోవిందరాజులు నాయుడు మాట్లాడారు. శుక్రవారం వరకు రిలేదీక్షలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు