కలెక్టరేట్‌లోనే ఆత్మహత్యాయత్నం

23 Jan, 2017 22:01 IST|Sakshi
పెట్రోలు పోసుకున్న హుస్సేన్‌వలీ
- పోలీసుల ఏకపక్ష తీరుకు నిరసనగా అఘాయిత్యం 
- అడ్డుకున్న పోలీసులు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): కోర్టు ఆదేశాల మేరకు న్యాయం చేయకపోగా పోలీసులు అన్యాయంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని పేర్కొంటూ ఓ వ్యక్తి సోమవారం ఏకంగా కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బాధితుడి వివరాల మేరకు.. బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన హుస్సేన్‌వలీకి ఆయన భార్య పాతిమా పేరు మీద 2011లో 14‘‘16 గజాల సైజులో ఇంటి స్థలం ఇచ్చారు. అయితే పెద్దస్వామి నాయక్‌ అనే వ్యక్తి ఈ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించాడు. విషయంపై పలుమార్లు గొడవ కూడా జరిగింది. చివరకు హుస్సేన్‌వలీ కోర్టును ఆశ్రయించగా తీర్పు అనుకూలంగా వచ్చింది.
 
కోర్టు ఆదేశాలను అమలు చేయడంతోపాటు పెద్దస్వామినాయక్‌పై కేసు నమోదు చేయాలని బనగానపల్లి పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పెద్దస్వామి నాయక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు హుస్సేన్‌ వలీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి వేధించడం మొదలెట్టారు. ఇందుకు సంబంధించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సోమవారం కుమారుడు ఖాదర్‌వలీతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చిన హుస్సేన్‌ వలీ వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు.  పోలీసులు అడ్డుకుని త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు ఆరాతీశారు. 
 
మరిన్ని వార్తలు