నిబద్ధతకు నిదర్శనం

7 Feb, 2017 01:20 IST|Sakshi
నిబద్ధతకు నిదర్శనం

డెయిరీ ఆవిర్భావంతో ఆత్మస్థైర్యం పెరిగింది
అవార్డు బాధ్యతను పెంచింది
ప్రతీ మహిళ పాడి పశువులను పెంచాలి
ముల్కనూర్‌ డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల


భీమదేవరపల్లి(హుస్నాబాద్‌): మహిళలు నేడు సమాజంలో సగ భాగమై అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌ మహిళలు మరో అడుగు ముందుకేసి ఏకంగా డెయిరీని ఏర్పాటు చేసుకొని నేడు వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారు. నిబద్ధతకు నిదర్శనంగా ముల్కనూర్‌ సొసైటీని తీర్చిదిద్ది నారీ లోకానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ)  ఈ నెల 2వ తేదీన ముల్కనూర్‌ డెయిరీకి ఉత్తమ అవార్డును అందించిన నేపథ్యంలో ముల్కనూర్‌ స్వకృషి డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీలను ‘సాక్షి’ పలుకరించగా పలు విషయాలు వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే...
కరువును ఎదుర్కునేందుకు మా కుటుంబాలకు కొంత తోడ్పాటు కోసం మేము 2002 సంవత్సరంలో ముల్కనూర్‌లో డెయిరీ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు గ్రామాల్లో తిరుగుతూ పాల సంఘాల సభ్యత్వ నమోదు కోసం కృషి చేశాం. ఆ విధంగా అన్ని గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించాం.

నిబద్ధతకు నిదర్శనంగా మహిళలమంతా సంఘటితంగా కృషి చేస్తూ అనేక ఒడిదొడుకులను అధిగమించి నేడు లాభాల బాటలో పయణిస్తున్నాం. ముల్కనూర్‌ సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సలహాలు, సూచనల మేరకు ప్రతీ ఏడాది డెయిరీ అనేక కొత్త పథకాలు, నూతన ఒరవడితో ముందుకెళ్తోంది. 140 గ్రామాల్లో  22 వేల మంది సభ్యులతో ప్రతి రోజు 55 వేల లీటర్ల పాలను సంఘాల నుంచి డెయిరీకి సేకరిస్తున్నాం. 22 వేల మంది ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడమే మా విజయానికి నిదర్శనం. పాల విక్రయాల్లో ఎలాంటి రాజీలేకుండా నాణ్యమైన పాలను అందిస్తున్నాం. పాల శుభ్రత, నాణ్యత, పశువుల ఆరోగ్యం, వాటి దాణతో పాటుగా సభ్యుల ఆరోగ్యం, వారి సంక్షేమం కోసమే నిరంతరం శ్రమించాం.... ఇంకా శ్రమిస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు కూడా లాభం కోసం చూడలేదు. లాభమే మమ్ములను వెదుక్కుంటూ వచ్చింది. అందుకే మా సేవలను గుర్తించి 2011 డిసెంబర్‌ 6న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘ అవార్డును అందుకున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకుగాను మూడు పర్యాయాలు డెయిరీకి ఐఎస్‌ఓ గుర్తింపు లభించడమే మా సొసైటీ నిబద్దతకు నిదర్శనం. ప్రతి మహిళ కూడా తప్పకుండా పాడి పశువును పెంచాలి. పాడి పశువుతో ఇంట్లో పాలు ఉండడంతో పాటుగా ఆర్థికంగా కొంత తోడ్పాటు ఉంటుంది.

త్వరలో ఐస్‌క్రీం విక్రయాలు..
డెయిరీ ద్వారా ఇప్పటి వరకు పాలు, పెరుగు, మజ్జిగ, దూద్‌పేడ్, లస్సీ, స్వీట్‌ లస్సీ, నెయ్యి పదార్థాలను విక్రయిస్తున్నాం. త్వరలో ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తాం. పెట్రోల్‌ పంపుల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులను విక్రయించేందుకు ఇటీవల హిందుస్థాన్‌ పెట్రోల్‌ కార్పోరేషన్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో 25 చోట్ల ఈ విక్రయాలను ప్రారంభిస్తాం. కాజీపేటలోని హిందుస్థాన్‌ పెట్రోల్‌ పంపులో కలెక్టర్‌ చేతుల మీదుగా ఇప్పటికే ప్రారంభించాం. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఇటీవల మా డెయిరీకి ఉత్తమ సహకార అవార్డును అందించింది. ఇది మహిళల సమష్టి కృషికి నిదర్శనం. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఇదే ఉత్సాహంతో పనిచేసి మరిన్ని అవార్డులను సొంతం చేసుకుంటాం.

అధ్యక్షురాలైనా...
ఎల్కతుర్తి మండలం దండెపల్లి గ్రామానికి చెందిన కడారి పుష్పలీల డెయిరీ ప్రారంభ సమయం నుంచి కష్టపడుతూ డెయిరీకి తన సేవలను అందిస్తోంది. దండేపల్లి పాల సంఘ అధ్యక్షురాలిగా కొనసాగుతూనే డెయిరీ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు.  గత రెండు పర్యాయాలుగా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అధ్యక్షురాలిగా ఓ వైపు డెయిరీ కార్యకలాపాలను సమీక్షిస్తూనే మరో వైపు తమ పాడి గేదెల పాలను స్వయంగా ఆమె పితికి ఆ ఊళ్లో కేంద్రానికి పోసి వస్తుంది. ప్రస్తుతం రోజుకు పది లీటర్ల పాలను ఆమె కేంద్రానికి పోస్తోంది. 

మరిన్ని వార్తలు