కార్పొరేషన్‌ అవినీతిపై కమిటీ వేయాలి

12 Dec, 2016 15:19 IST|Sakshi
కార్పొరేషన్‌ అవినీతిపై కమిటీ వేయాలి

– రోడ్డు విస్తరణ పేరుతో  ఎంపీ, ఎమ్మెల్యే నాటకాలు
– మేయర్‌ అవినీతి గురించి కార్పొరేటర్లే చెబుతున్నారు
– వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి


అనంతపురం న్యూసిటీ : ‘రోడ్డు విస్తరణ చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని సీఎం చంద్రబాబు నాయుడు వేశారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా  నగరపాలక సంస్థలో అవినీతి జరిగింది. అధికార పార్టీ దెబ్బకు ఎంత మంది కమిషనర్లు వెళ్లిపోయారో అందరికీ తెలుసు. వీరి అవినీతిపై కమిటీ వేస్తే మేయర్‌ స్వరూప, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఢొంక బయటపడుతుంది' అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి అన్నారు. మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఎంపీ నిధుల కింద  గతంలోనే భవనాన్ని ఏర్పాటు చేస్తే,  వాటికి తిరిగి రూ.4.5 లక్షలు బిల్లు చేసిన ఘనత పాలకవర్గానికే దక్కుతుందన్నారు.

దొంగ బిల్లులు చేసిన అధికారులు, ప్రగల్భాలు పలికే మేయర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం వచ్చారని, స్వాతంత్య్ర వేడుకలంటూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాసింత మట్టి తొలగించడం, లైట్లు వేయడం, మొక్కలు నాటడమే అభివృద్ధి అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.  నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి  తెలియదా? అని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ పేరుతో నాటకాలాడుతున్నారన్నారు.  ఇంతటి దౌర్భాగ్యమైన నగరపాలక సంస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు.

ఇక మేయర్‌ తమపై మాట్లాడడం అర్థరహితమన్నారు.  మేయర్‌ అవినీతిని బయటపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యే, మేయర్‌ ఎక్కడకు వెళ్లిన మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారన్నారు.  మిస్సమ్మ స్థలం బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిందని కోర్టు చెప్పినా ఎవరిని మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి కాంగ్రెస్, టీడీపీ, పీఆర్‌పీల చుట్టూ తిరిగి అదే ఆలోచనలతో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆలోచనలతో ముందుకెళ్తున్నామని మా నిజాయితీ ఏంటో మీ పార్టీ ముఖ్యనేతలకే తెలుసన్నారు.

కార్పొరేటర్లే తిరగబడుతున్నారు : మేయర్‌ స్వరూపపై అధికార పార్టీకు చెందిన కార్పొరేటర్లే తిరుగుబాటు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌ రెడ్డి ఆరోపించారు. సాక్షాత్తు మంత్రి నారాయణకు మేయర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అభివృద్ధి పనుల కేటాయింపులో వివక్ష చూపుతోందని ఆరోపించారన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో సొంత పార్టీకు చెందిన ఎంపీనే నగరపాలక సంస్థ ముందు ధర్నా చేశారన్నారు. ఎమ్మెల్యే, మేయర్‌ రాజకీయాలు ఏపాటివో అర్థం చేసుకోవాలన్నారు.  ఆధిపత్య పేరుతో నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

మరిన్ని వార్తలు