జంతు హింస నివారణ సంఘ కమిటీ రద్దు

22 Jul, 2017 00:05 IST|Sakshi
  •  కాకినాడ ఆర్డీవో చైర్మన్‌గా సబ్‌ కమిటీ
  •  13 మందిపై కేసు నమోదు
  •  ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌
  • కాకినాడ సిటీ: 

    జంతుహింస నివారణ కేంద్రం ప్ర„ýక్షాళనకు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా చర్యలు చేపట్టారు. ఇటీవల కేంద్రంలో సుమారు 30కి పైగా పశువులు మరణించిన విషయం తెలిసిందే. పిఠాపురం మహారాజా మెమోరియల్‌ జంతు హింస నివారణ సంస్థ నిర్వహణ బాగోలేదని నిర్ణయించి ఈ మేరకు ఇప్పటి వరకు ఉన్న సంఘ కమిటీని రద్దు చేస్తూ శుక్రవారం కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ఆర్డీఓను చైర్మన్‌గా ఒక సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిటీలో జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌తో పాటు  కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లను కన్వీనర్లుగా, జిల్లా ఎస్పీ నిర్ణయించిన వారిలో ఒకరిని, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులను సభ్యులుగా నియమించారు. కాకినాడ ఆర్డీవో పర్యవేక్షణ, జంతుహింస నివారణ కేంద్రం పరిసరాలు శుభ్రత విషయంలో చర్యలకు మున్సిపల్‌ కమిషనర్‌నూ, పశువుల మేత, ఆరోగ్య రక్షణతోపాటు అనారోగ్యం బారిన పడిన పశువులు కోలుకునేందుకు అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని పశుసంవర్థకశాఖ జేడీని ఆదేశించారు.  కేంద్రంలో పరిస్థితి చక్కబడే వరకు కొత్త పశువులను అనుమతించకూడదని, ప్రస్తుతం ఉన్న వాటిలో ఆరోగ్యంగా ఉన్న సుమారు 150 పశువులను పోషణకు గాను రంపచోడవరం ఐటీడీఏకు అందజేసేలా ఆదేశాలు జారీ చేశారు. సబ్‌ కమిటీ వారానికి ఒకసారి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.
    .
    విరాళాలు అందజేయాలి...
     జంతుహింస నివారణా కేంద్రానికి విరాళాలు ఇవ్వదలచినవారు రెవెన్యూ డివిజనల్‌ అధికారి కాకినాడ పేరన ఉన్న బ్యాంకు అకౌంటుకు అందజేయవచ్చని ఆర్డీవో ఎల్‌.రఘుబాబు ఒక ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాల కోసం కాకినాడ ఆర్డీవో కార్యాలయం 0884–2368100 ఫోన్‌ నెంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.
    .
    13 మంది కమిటీ సభ్యులపై కేసు నమోదు:
    పశువులు చనిపోవడానికి కారణంగా భావిస్తూ 13 మంది కమిటీ సభ్యులపై ఐపీసీ 428, 429 సెక‌్షన్ల కింద సర్పవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు స్టేషన్‌ సీఐ చైతన్యకృష్ణ వివరించారు. 
     
మరిన్ని వార్తలు