కమ్యునిస్టుల త్యాగాలు వెలకట్టలేనివి..

13 Sep, 2016 01:11 IST|Sakshi
కమ్యునిస్టుల త్యాగాలు వెలకట్టలేనివి..
  • వారే తెలంగాణ సాయుధ పోరాటానికి మారుపేరు
  • యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతుంది
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
  • మానుకోటకు చేరిన సీపీఐ బస్సు యాత్ర
  • మహబూబాబాద్‌ : తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు అని.. వారి త్యాగాలు వెలకట్టలేనివని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వీరతెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర ఖమ్మం మీదుగా సోమవారం రాత్రి మానుకోకు చేరింది. ఈ యాత్రకు స్థానిక నాయకులు స్వాగతం పలకగా పట్టణంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. అనంతరం స్థానిక వీరభవన్‌ ఎదుట పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన కమ్యూనిస్టు యోధుల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని.. వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.
     
    ఇక తెలంగాణ పోరాట యోధుల పోరాట పటిమను, త్యాగాలను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్‌ 17న వచ్చిందన్నారు. ఈ మేరకు 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ కార్యక్రమాలు చేపట్టామని వెంకట్‌రెడ్డి తెలిపారు. అనంతరం సెప్టెంబర్‌ 17న హైదరా ఎగ్జిబిషన్‌ గౌండ్‌లో జరగనున్న సమావేశంలో నాటి పోరాట యోధులతో పాటు మలివిడత తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్‌ కోదండరాంను సన్మానించనున్నామని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు పద్మ, బి.అజయ్‌, దాస్యం రామ్మూర్తి, ఫాతిమా, పెరుగు  కుమార్‌, రేశపల్లి నవీన్‌, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, యాకాంబ్రం, జటంగి శ్రీశైలం, మంద శంకర్‌, అనిల్‌ కుమార్‌, తోట విజయ్‌, వీరవెల్లి రవి, లింగ్యానాయక్‌, తోట బిక్షపతి, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు