మెట్రోలతో పోలిస్తే మన సిటీ సేఫ్‌!

30 Aug, 2016 22:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నగర, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పోలీసులు తీసుకుంటున్న చర్యలు పూర్తి సత్పలితాలనిస్తున్నాయి. భద్రత పరంగా ఎప్పటికప్పుడూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కిందిస్థాయిలో చేస్తున్న విజుబుల్‌ పోలీసింగ్‌తో నేరాలు తగ్గముఖం పడుతున్నాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులతో పొల్చుకుంటే వందకు వంద శాతం హైదరాబాద్‌ నగరమే మేలనే విషయం తాజాగా నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) మంగళవారం విడుదల చేసిన నివేదిక–2015లో పేర్కొన్నారు. ఒకటీ, రెండు మినహా చాలా రకాల నేరాల్లో మెట్రో నగరాల తర్వాతనే హైదరాబాద్‌ ఉండటం గమనార్హం.

తగ్గుముఖం పట్టిన చోరీలు, దోపిడీ కేసులు...
ఢిల్లీ, ముంబై, బెంగళూరు మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో చోరీలు, దోపిడీ కేసులు చాలా తగ్గుముఖం పట్టాయి. వీటి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. దొంగతనాల కేసుల్లో హైదరాబాద్‌ ఈ మూడు మెట్రో నగరాలతో పొలిస్తే చివరి స్థానంలో ఉంది. ఢిల్లీ (96,924), ముంబై (10,422), బెంగళూరు (11,409) తర్వాత హైదరాబాద్‌లో చాలా తక్కువగా 3,547 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక దోపిడీ కేసుల్లోనూ ఢిల్లీ (6,766), ముంబై (1,708), బెంగళూరు (707) నగరాల తర్వాత హైదరాబాద్‌ (104) ఉంది.

మహిళలు, పిల్లలకు భరోసా...
మహిళలు, పిల్లలకు సంబంధించిన నేరాల్లో పోలీసు పనితీరు స్పష్టంగా కనబడింది. మహిళలపై అత్యాచార కేసుల్లో 1893 కేసులతో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా, ముంబై (1583),  బెంగళూరు (777), హైదరాబాద్‌ (332)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కిడ్నాప్, అపహరణ కేసుల విషయానికి వస్తే ఢిల్లీ (6630), ముంబై (1583), బెంగళూరు (777), హైదరాబాద్‌ (104)లు వరుసగా ఉన్నాయి.

 రాష్‌ డ్రైవింగ్‌ మనచోట తక్కువేనట...
నగర  ట్రాఫిక్‌ పోలీసులు తీసుకుంటున్న చర్యలు రాష్‌ డ్రైవింగ్‌కు ముకుతాడు వేస్తున్నాయి. అతి వేగం వల్ల వాహనం నడిపి గాయాలైన కేసుల్లో ఎక్కువగా అంటే మెట్రో నగరాల్లో దేశ రాజధాని 7,411 కేసులతో తొలి స్థానంలో ఉంది. బెంగళూరు (4255), ముంబై (3,963), హైదరాబాద్‌ (2336) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫోర్జరీ కేసుల్లో ముంబై (754), ఢిల్లీ (466),  బెంగళూరు (45), హైదరాబాద్‌ (37)లు ఉన్నాయి. అల్లర్ల కేసుల్లో ముంబై (396), బెంగళూరు (373), ఢిల్లీ (108), హైదరాబాద్‌ (42)లు వరుస స్థానాల్లో ఉన్నాయి.

భర్తల క్రూరత్వంలో సెకండ్‌ ప్లేస్‌...
వరకట్న హత్య కేసుల విషయానికివస్తే 100 కేసులతో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. 54 కేసులతో బెంగళూరు, 25 కేసులతో హైదరాబాద్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబైలో తొమ్మిది కేసులు మాత్రమే నమోదయ్యాయి. భర్తల క్రూరత్వంలో ఢిల్లీ 3900 కేసులతో తొలి స్థానంలో ఉండగా, 1,606 కేసులతో హైదరాబాద్‌ రెండో స్థానంలో ంది. ముంబై 658, బెంగళూరులో 483 కేసులు ఉన్నాయి. అయితే ఓవరాల్‌గా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలతో పొల్చుకుంటే సేఫేస్ట్‌ సిటీగా హైదరాబాద్‌ ఉందడనంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి.

 

మరిన్ని వార్తలు