పట్టిసీమ తరహాలో పరిహారం

23 Jul, 2016 18:24 IST|Sakshi
పట్టిసీమ తరహాలో పరిహారం

కడప సెవెన్‌రోడ్స్‌ :
 పట్టిసీమ తరహాలో గండికోట ముంపు వాసులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని వివిధ పార్టీలు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అన్నింటా అభివృద్ధి చెంది ఉపాధికి ఎన్నో అవకాశాలు ఉన్న కోస్తా ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టుల కింద నష్టపోయిన రైతులకు భారీ ప్యాకేజీ ఇస్తున్న ప్రభుత్వం, వెనకబడ్డ రాయలసీమ పట్ల వివక్ష ప్రదర్శించడం తగదన్నారు. కొత్త భూసేకరణ
చట్ట ప్రకారం 2016 సంవత్సరాన్ని కటాఫ్‌గా తీసుకుని పరిహారం ఇవ్వకుండా, గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపడానికి ముంపు వాసులు అడ్డుతగులుతున్నారంటూ నింద మోపడం అన్యాయమన్నారు. ముంపువాసుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.

అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య జిల్లా కన్వీనర్‌ దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి అధ్యక్షతన శనివారం ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1977లో  మైలవరం రిజర్వాయర్‌ ముంపు కింద చౌటుపల్లె వాసులకు ఎకరాకు ఆరు వేల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చారన్నారు. ఆ గ్రామం ముంపునకు గురి కాకపోవడంతో ప్రజలు అలాగే నివాసం ఉన్నారన్నారు. 1988లో కొన్ని ఇళ్లకు నామమాత్రంగా నష్టపరిహారాన్ని ఇచ్చినప్పటికీ గ్రామాన్ని ఖాళీ చేయించలేదని తెలిపారు. 1996లో మరో గ్రామ ముంపు వాసులకు చౌటుపల్లెను ఆనుకుని 250 పక్కా గృహాలను ప్రభుత్వమే కట్టించిందన్నారు. పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్‌ కూడా ఏర్పాటు చేయడంతో ఇక తమ గ్రామం ముంపు కిందికి వెళ్లదని భావించి చౌటుపల్లె వాసులు అక్కడే నివాసాలు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ పక్కా గృహాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తున్నారని వివరించారు. అయితే చౌటుపల్లె వాసులకు మాత్రం మొండి చేయి చూపడం అన్యాయమన్నారు. మిగతా ముంపు గ్రామాల వాసులకు 2006 కటాఫ్‌ కాకుండా 2016 ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ కె.జయశ్రీ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌ ఛార్జిలను ఇష్టానుసారం పెంచుతూ వారి జేబులు నింపుతున్న ప్రభుత్వానికి ముంపువాసులకు పరిహారం ఇచ్చేందుకు చేతులు రావడం లేదని విమర్శించారు. 1977లో నామమాత్రంగా పరిహారం ఇచ్చినప్పటికీ చౌటుపల్లె వాసులు ఖాళీ చేయించలేదన్నారు. ఇప్పుడు పరిహారం అడిగే హక్కు లేదని మాట్లాడటం అన్యాయమన్నారు. మండల కేంద్రమైన కొండాపురంలో 180 ఇళ్లకు సుమారు రూ. 80 కోట్లు ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని, మునకకు ఆనుకుని ఉండే మరో 180 ఇళ్లకు పరిహారం ఇచ్చేందుకు మొండికేయడం తగదన్నారు. 2006 కటాఫ్‌ కాకుండా 2016 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అన్ని ఇళ్లను అక్వైర్‌ చేసి పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేత హోదాలో లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు నేడు ఆ విషయాన్ని విస్మరించడం శోచనీయమన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ గండికోట రిజర్వాయర్‌ను నీటితో నింపాల్సిన ఆవశ్యకత ఉందని, అయితే ముందు రైతులకు సముచితపరిహారం అందజేసి గ్రామాలను ఖాళీ చేయించాలన్నారు.  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోమశిల ముంపువాసులకు రూ. 2 లక్షలు చొప్పున పరిహారాన్ని ఇవ్వడంతో వారు సంతోషంగా గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిన సంగతి ఆయనకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరో కొత్త ప్రాంతంలో రైతులు స్థిరపడే వరకు ప్రభుత్వం అన్ని విధాల సాయం చేయాలని కోరారు. వంశధారకింద రూ. 7 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం గండికోట ముంపు కింద మాత్రం లక్ష రూపాయలు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తే తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించరన్నారు. ముంపువాసులు చేసే పోరాటాలకు తమ పార్టీ అండగా నిలుస్తుందని హామి ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.నారాయణ మాట్లాడుతూ ముంపు వాసులను ఖాళీ చేయించి మరోచోట స్థిరనివాసం కల్పించేందుకు ఎంత ఖర్చవుతుందో అంత మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతమున్న ధరలు, జీవనవ్యయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ పద్ధతిలో పరిహారం కల్పించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరారు. గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిన తర్వాత మరోచోట బ్రతికేందుకు రైతుల్లో విశ్వాసం కలిగేంత వరకు అన్ని రూపాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం మెరుగైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. ముంపువాసులు రాజకీయాలకు అతీతంగా సంఘటితపడి ఆందోళనలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముంపువాసులకు మంచి ప్యాకేజీని ఇవ్వడంతోపాటు నివాస యోగ్యమైన స్థలాలు చూపాలన్నారు. కాలనీల్లో మౌళిక వసతులను కల్పించాలన్నారు. సముచిత పరిహారం ఇచ్చేవరకు గ్రామాలను ఖాళీ చేయించరాదన్నారు. ముంపు వాసుల ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డీఎన్‌ నారాయణ, మైదుకూరు బీజేపీ నాయకుడు బీపీ ప్రతాప్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.రామసుబ్బారెడ్డి, చౌటుపల్లె, ఏటూరుకు చెందిన ముంపు వాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు