భర్త వేధిస్తున్నాడు

24 Oct, 2016 19:13 IST|Sakshi
భర్త వేధిస్తున్నాడు
-ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పిలిపించినందుకు..
– పోలీసు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించిన నందికొట్కూరు విజయకుమారి 
 
కర్నూలు: మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు పిలిపించినందుకు భర్త వేధిస్తున్నాడని నందికొట్కూరుకు చెందిన విజయకుమారి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనపై ఇష్టం లేక పెళ్లి జరిగినప్పటినుంచి భర్తతో పాటు అత్త, కుటుంబ సభ్యులు అపనిందలు మోపి విడిపించుకోవాలని చూస్తున్నారని ఆమె  కన్నీటి పర్యంతమయ్యారు. హత్యాప్రయత్నం కూడా చేశారని ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో ఆమె పేర్కొన్నారు. సోమవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పోలీస్‌ ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567 సెల్‌ నంబర్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్‌ చేసుకున్నారు. అలాగే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు నేరుగా వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 
ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... 
– తన  భర్త కనిపించడం లేదని, ఒక మహిళపై అనుమానమున్నదని, ఆమె నుంచి వివరాలు రాబట్టి భర్త ఆచూకీ తెలపాలని కర్నూలు బాలాజీనగర్‌కు చెందిన హర్షియా బేగం ఎస్పీని వేడుకున్నారు. 
– తన తల్లి ప్రతిరోజూ మానసికంగా వేధిస్తోందని హోళగుంద గ్రామానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. 
– ప్రగతి మహిళా పరస్పర సహాయక సహకార పొదుపు సంఘంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వేయించుకుని, దానిని వాడుకున్నారని కర్నూలు నగరం ఎస్‌.నాగప్ప వీధికి చెందిన రసూల్, షాన్‌లాజ్‌తో పాటు మరికొంతమంది సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డయల్‌ యువర్‌ ఎస్పీ, పోలీస్‌ ప్రజాదర్బార్‌ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
 
మరిన్ని వార్తలు