30లోగా పనులు పూర్తి చేయాలి

24 Jul, 2016 00:09 IST|Sakshi
30లోగా పనులు పూర్తి చేయాలి
- పుష్కరాలకు వచ్చే ఏ ఒక్కరికీ ఇబ్బందులు రానివ్వొద్దు
–ఏర్పాట్ల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
–ముఖ్యమంత్రి డేగ కన్ను పెట్టారు.. అధికారులు జాగ్రత్తగా ఉండాలి
–కృష్ణా పుష్కర పనులపై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కృష్ణా పుష్కరాల పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వచ్చే నెల 12నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో జరుగుతున్న వివిధ పనులను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, దాదాపు కోటిన్నర మంది భక్తులు వస్తారన్న అంచనాతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.   పుష్కర స్నానం కోసం వచ్చే ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా తిరిగి వెళ్లాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. అయితే, పుష్కరాల ఏర్పాట్ల విషయంలో కొంత జాప్యం జరుగుతోందని, అధికారులు అలసత్వంగా ఉంటే సహించేది లేదని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. పుష్కరాలు పూర్తయ్యేంతవరకు అధికారులకు సెలవులు ఇచ్చేది లేదని తాను కూడా   ఇక్కడే ఉండి పనులు చూసుకుంటానని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఏమాత్రం అలతస్వం వహించినా అధికారులకు పనిష్‌మెంట్‌ తప్పదని హెచ్చరించారు.   దేవరకొండ డివిజన్‌లో జరుగుతున్న పనులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పనులు ఇంకా ఓ కొలిక్కి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్కింగ్‌ స్థాలు, హోల్డింగ్‌ పాయింట్ల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కర ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని, ముఖ్యమంత్రి ఈ పనులపై డేగకన్ను పెట్టారన్న విషయాన్ని అధికారులంతా దృష్టిలో ఉంచుకోవాలన్నారు.  జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌. ఎన్‌. సత్యనారాయణ, అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, అటవీశాఖ అదనపు చీఫ్‌ కన్జర్వేటర్‌ పర్గేన్, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్‌. భాస్కరరావుతో పాటు పలువురు జిల్లా అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. 
ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు : మంత్రి జగదీశ్‌రెడ్డి
సమీక్ష సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2004 పుష్కరాల సందర్భంగా కేవలం 11 ఘాట్లలో మాత్రమే భక్తుల స్నానాలకు ఏర్పాట్లు చేశారని, ఈసారి జిల్లా వ్యాప్తంగా 28 పుష్కర ఘాట్లు అందుబాటులోకి తెస్తున్నట్ల చెప్పారు.   పుష్కర పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయని, రహదారుల నిర్మాణం 65 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రత్యేక పార్కింగ్‌ కోసం నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిలో 544 ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు మంత్రి వివరించారు. ఇకపై  క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను తానే పర్యవేక్షిస్తానని, పుష్కరాలు పూర్తయ్యేవరకు అధికారులతో పాటు తాను కూడా ఉంటానని చెప్పారు.  
మరిన్ని వార్తలు