కాలిబాట వదిలితేనే పైరు పదిలం

8 Aug, 2017 22:51 IST|Sakshi
కాలిబాట వదిలితేనే పైరు పదిలం
  • వరి నాట్లలో సమగ్ర యాజమాన్యం తప్పనిసరి
  • ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ సంపత్‌కుమార్‌
  •  

    అనంతపురం అగ్రికల్చర్‌:

    వరి పంట వేసే రైతులు అధిక దిగుబడుల కోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. 

     

    సమగ్ర సాగు పద్ధతులు

    వరి నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే పొలాన్ని దుమ్మ చేయడం ప్రారంభించి రెండు మూడు దఫాలుగా మురగబెట్టాలి. పొలమంతా సమానంగా చెక్కతోకాని ఇతరత్రా పరికరంతో చదను చేసుకోవాలి. రేగడి భూముల్లో రెండు రోజుల ముందుగా ఈ కార్యక్రమం పూర్తి చేసి నాట్లు వేసుకోవాలి. నారు తీసే సమయంలో మొక్కలు లేత ఆకుపచ్చగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులున్నపుడు నాటాలి. ముదురు నారు నాటితే దిగుబడులు తగ్గుతాయి.

    చదరానికి 33 మూనలు (మొక్కలు) ఉండేలా నాటుకోవాలి. ప్రతి రెండు మీటర్ల నాట్లకు 20 సెంటీమీటర్లు (సెం.మీ) కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతి తగ్గుతుంది. అలాగే కలుపు మందులు పిచికారి, ఎరువుల వేయడానికి అనువుగా ఉంటుంది. భూసారం ఎక్కువగా ఉన్న పొలాల్లో తక్కువ కుదుళ్లు, తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్లు ఉండేలా నాటాలి. ముదురు నారు నాటినపుడు కుదుళ్ల సంఖ్య పెంచి, కుదురుకు నాలుగైదు మొక్కలు నాటాలి. అలా నాటినపుడు నత్రజని మామూలుగా వేసేదాని కన్నా 25 శాతం ఎక్కువ వేయాలి. నీరు తక్కువగా పెట్టి నాట్లు వేసుకోవాలి.

    ఎరువులు, కలుపు నివారణ

    ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్‌ అవసరం. నత్రజనిని మూడు భాగాలుగా చేసి దమ్ము, దబ్బు, అంకురం దశలో వేసుకోవాలి. భాస్వరం ఒకేసారి వేసుకోవాలి. పొటాష్‌ ఎరువును రేగడి నేలల్లో ఒకేసారి, తేలికపాటి నేలల్లో సగం దమ్ము సమయంలోనూ మిగతా సగం అంకురం దశలో వేయాలి. నాటిన మూడు నాలుగు రోజుల్లోగా నీరు పలుచన చేసి ఎకరాకు ఒక లీటర్‌ బుటాక్లోర్‌ లేదా అర లీటర్‌ ప్రెటిటాక్లోర్‌ లేదా అర లీటర్‌ అలిలోఫాస్‌ 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లితే కలుపు సమస్య తగ్గుతుంది. నాటిన 15 నుంచి 20 రోజుల సమయంలో ఎకరాకు 50 గ్రాములు ఇథార్స్‌సల్యురాన్‌ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నాట్లు వేసిన రెండు నుంచి ఆరు వారాల్లో పైరు సరిగా ఎదగక జింకులోపం రావచ్చు. ముదురాకు చివర్లో, మధ్య అనెకు ఇరువైపులా తుప్పు మచ్చలు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడుతాయి. దీని నివారణకు 2 గ్రాములు జింక్‌సల్ఫేట్‌ లీటర్‌ నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.  

మరిన్ని వార్తలు