ఇంకా ఆంక్షల మధ్యే..

14 Mar, 2017 01:45 IST|Sakshi
ఇంకా ఆంక్షల మధ్యే..
భీమవరం : భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ బాధిత గ్రామాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్‌ను సడలించలేదు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదేమైనా సరే.. తమ ప్రాణాలు పోయినా ఆక్వా పార్క్‌ను నిర్మించనీయబోమని కరాకండీగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అఖిలపక్షనాయకులు బాధిత గ్రామాల్లో పర్యటించనున్నారు. సీపీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్, జనసేన, బీఎస్పీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు భీమవరం మండలం తుందుర్రుతోపాటు నరసాపురం మండలం జొన్నలగరువు, కంసాలిబేతపూడి, శేరేపాలెం, ముత్యాలపల్లి  గ్రామాల్లో  పర్యటించనున్నారు. ప్రజల గోడు వినేందుకు తాము వెళ్తున్నామని, అనుమతి ఇవ్వాలని ఇప్పటికే  ఎస్పీ, డీఎస్పీలకు వినతిపత్రాలు ఇచ్చారు.  గ్రామాల్లో శాంతియుతంగా పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల వారికి కలిగే ఇబ్బందులు తెలుసుకుంటామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావుండదని అధికారులకు విన్నవించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. 
 
గ్రామాల్లో హడల్‌ 
ఈనెల 8న ఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఫుడ్‌పార్క్‌ వ్యతిరేక పోరాటకవిుటీ, సీపీఎం సిద్ధం కాగా ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు  ప్రభుత్వం పెద్దఎత్తును పోలీసు బలగాలను మోహరించి బాధితులపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి జీపుల్లో కుక్కిన పోలీసుల దమనకాండ గుర్తుచేసుకుని ఇప్పటికీ బాధిత గ్రామ ప్రజలు హడలెత్తిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. 
 
ధైర్యం నింపేందుకే..
ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెసుకుని వారిలో ధైర్యం నింపేందుకు అఖిపక్షం నాయకులు సిద్ధమయ్యారు.  9న విజయవాడలో వివిధ పార్టీల నాయకులు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి ఈనెల 14న ఫుడ్‌పార్క్‌ ప్రభావిత గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఐదు గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పర్యటించి రొయ్యల ప్యాక్టరీ వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను తెలుసుకోనున్నారు. దీంతో తమ వద్దకు వచ్చే నాయకులకు తమ గోడు వినిపించేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా గతంలో తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామాల్లో పర్యటించిన పర్యావరణవేత్తల అభిప్రాయాలను, రొయ్యల ప్యాక్టరీ వల్ల  తాగు, సాగునీటి ఇబ్బందులు, వాతావరణ కాలుష్యం వంటి అంశాల గురించి ప్రముఖులు చెప్పిన వివరాలను అఖిలపక్ష బృందానికి తెలియజేయాలని నిశ్చయంచుకున్నారు.
 
సర్కారుపై ఆగ్రహం 
ఇదిలా ఉంటే ఫుడ్‌పార్క్‌ వల్ల తలెత్తే నష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లడంపై  బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్క్‌ వల్ల గ్రామాల్లోని మంచినీటి చెరువులు, గొంతేరు డ్రెయిన్‌ కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొంతేరు డ్రెయిన్‌లో సహజసిద్ధంగా పెరిగే మత్స్యసంపద హరించుకుపోతోందని, దీనివల్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సర్కారుకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా.. మొండిగా ముందుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో ఫుడ్‌పార్క్‌ కలుషిత నీరు చుక్క కూడా బయటకు రాదని, ఫ్యాక్టరీ ఆవరణలో ఆ నీటితో మొక్కలు పెంపకం చేపడతామని యాజమాన్యం చెప్పగా, ఉద్యమం తీవ్రరూపం దాల్చిన తర్వాత కలుషిత జలాలను సముద్రంలో కలిపేలా ప్రత్యేకంగా పైప్‌లైన్‌ వేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ముందుగా కలుషిత నీరు రాదని చెప్పి.. ఇప్పుడు పైపులైన్లు ఎలా వేస్తారని బాధితులు  ప్రశ్నిస్తున్నారు. అఖిలపక్ష నాయకులు తమ గోడు విని ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. 
 
మరిన్ని వార్తలు