నిబంధనలు.. తూచ్‌!

29 Jul, 2016 00:50 IST|Sakshi
నిబంధనలు.. తూచ్‌!
 ఆర్‌యూ రిజిస్ట్రార్‌కు ఉర్దూ వర్సిటీ బాధ్యతలు 
ఇన్‌చార్జ్‌ వీసీ నిర్ణయం
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌ నియామకం విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌చార్జి వీసీ ఈ విషయంలో నిబంధనలు పాటించలేదని వాటి సారాంశం. రాయలసీమ యూనివర్సిటీ నుంచే డాక్టర్‌ అబ్దుల్‌హక్‌ ఉర్దూ యూనివర్సిటీ పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం ఉర్దూ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ఆర్‌యూ వీసీ వై. నరసింహులును నియమించింది. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ఎవరినీ నియమించలేదు. అయితే ఇన్‌చార్జి వీసీ ఆర్‌యూ రిజిస్ట్రార్‌ అమరనాథ్‌కే ఊర్దూ వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు.
 ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ పేరు మీద ప్రకటనలు..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ ప్రవేశాలకు పచ్చజెండా ఊపింది. తాత్కాలికంగా ఉస్మానియా డిగ్రీ కళాశాలలో తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి వీసీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌తో పాలన సాగించాలని నిర్ణయించారు. తర్వాత ఏఓను నియమించకపోగా అమర్‌నాథ్‌కే అనధికారికంగా బాధ్యతలు అప్పగించారు.  ఉర్దూ వర్సిటీ ప్రకటనలు, న్యూస్‌ బులెటిన్లు రిజిస్ట్రార్‌ పేరుతో విడుదల అవుతున్నాయి.
 
నిబంధనలకు విరుద్ధం..
 ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఒక యూనివర్సిటీ అధికారి మరో యూనివర్సిటీకి పని చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ నియామకంలో వీసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా తప్పులు దొర్లితే బాధ్యత ఎవరూ వహిస్తారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఉర్దూ  వర్సిటీ రిజిస్ట్రార్‌ నియామకంపై వీసీ దష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌ నియామకం కోసం ప్రభుత్వానికి కనీసం నివేదిక కూడా పంపలేదని తెలుస్తోంది.  
 
నా పేరుతో ప్రకటనలు ఇవ్వలేను  
 వీసీ పేరుతో ప్రకటనలు విడుదల చేయడానికి వీలు కాదు. తాత్కాలికంగా అమర్‌నాథ్‌కే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగించా. త్వరలోనే ఉర్దూ వర్సిటీకి పూర్తి స్థాయి రిజిస్ట్రార్‌  వస్తారు. – వై. నరసింహులు, వైస్‌ ఛాన్స్‌లర్‌
 
మరిన్ని వార్తలు