18న రోబోటిక్, అవయవ మార్పిడి సర్జరీలపై సదస్సు

15 Sep, 2016 01:16 IST|Sakshi
18న రోబోటిక్, అవయవ మార్పిడి సర్జరీలపై సదస్సు
విజయవాడ (లబ్బీపేట) : ఏస్టర్‌ రమేష్‌ అకడమిక్‌ అలయన్స్‌ ఆధ్వర్యంలో నిష్ణాతులైన వైద్యులతో వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని భావించామని, ఆ క్రమంలో ఈనెల 18న జాతీయస్థాయిలో 16 మంది నిష్ణాతులైన వైద్య నిపుణులతో సదస్సు నిర్వహించనున్నట్లు రమేష్‌ ఆస్పత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.రమేష్‌బాబు చెప్పారు. బుధవారం విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్‌బాబు మాట్లాడుతూ.. ఈ సదస్సులో రోబోటిక్‌ సర్జరీలు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సపై సింపోజియం నిర్వహించడంతోపాటు ప్రస్తుత వైద్య విధానాల్లో ఆధునిక పద్ధతులపై వైద్యులకు అవగాహన కలిగించనున్నట్లు వెల్లడించారు. ఏపీలోని ఆరు జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటారని, ప్రారంభోత్సవంలో వైద్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారని వివరించారు. చిన్న గాటుతో రోగి త్వరగా కోలుకునే చికిత్సలు ఇప్పుడు రోబోటిక్‌ సర్జరీల రూపంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని ఇప్పుడిప్పుడే మన దేశానికి తీసుకొస్తున్నామని చెప్పారు. నవ్యాంధ్రలో ఏస్టర్‌ రమేష్‌ ఆస్పత్రి ఈ పరిజ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా అవలంబించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. గుండె, కిడ్నీ, లివర్‌ వంటి అవయవ మార్పిడి చికిత్సలు, మినమల్‌ యాక్సస్‌ గుండె బైపాస్‌ సర్జరీలు, కాస్మోటిక్‌ సర్జరీలు, గ్యాస్ట్రో ఇంటెసై్టనల్‌ అంకాలజీ సర్జరీలు గుంటూరు, విజయవాడల్లో తర్వలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా సర్జరీలపై ఈ సదస్సులో అవగాహన కలిగించనున్నట్లు పేర్కొన్నారు.  సమావేశంలో ఆస్పత్రి జీఎం డాక్టర్‌ సుదర్శన్, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్, ఏజీఎం డాక్టర్‌ జె.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు