నాలుగు జిల్లాలు ఖాయం!

8 Sep, 2016 00:17 IST|Sakshi
నాలుగు జిల్లాలు ఖాయం!
  • ఏర్పాట్లకు నిధులు విడుదల
  • రూ.4 కోట్లు కేటాయించిన సర్కారు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళిక శాఖ 
  • జిల్లాల సంఖ్యపై పూర్తి స్థాయి స్పష్టత
  • హన్మకొండ, కాకతీయ జిల్లాలపై ఆసక్తి 
  • సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : జిల్లాల పునర్విభజనలో మన జిల్లా పరిస్థితి సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. కొత్తగా ఏర్పడబోయే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్, ఫైళ్లు, కంప్యూటర్లు అమర్చుకునేందుకు ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు జిల్లాకు రూ.4 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.
     
    ఇది పరిపాలన పరమైన అంశమే అయినా... మన జిల్లాకు నాలుగు కోట్లు కేటాయించడం ఆసక్తి కలిగిస్తోంది. వరంగల్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదాలో పేర్నొన్నట్లుగా నాలుగు జిల్లాలు ఉండవని... చివరికి మూడు జిల్లాలే ఉంటాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నిధుల కేటాయింపు ఉత్తర్వులతో నాలుగు జిల్లాలు ఉంటాయనేది స్పష్టమైంది. 
     
    రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్‌ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలని ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. ఇతర జిల్లాల్లోని కొన్ని మండలాలను కలుపుతూ... వరంగల్, హన్మకొండ, జయశంకర్‌(భూపాలపల్లి), మహబూబాబాద్‌ జిల్లాలు ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొంది. జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్‌ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్విభజిస్తారని తెలిసింది. అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
     
    కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన ముసాయిదా అందరినీ ఆశ్చర్యపరిచింది. వరంగల్‌ జిల్లాను... నాలుగు జిల్లాలుగా పునర్విభజించేలా ముసాయిదాలో పేర్కొంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌ నగరాన్ని రెండు జిల్లాలకు కేటాయించవద్దని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హన్మకొండ జిల్లాను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. హన్మకొండ స్థానంలో వరంగల్‌ రూరల్‌(కాకతీయ) జిల్లా ఏర్పాటు కానుందని తాజాగా చర్చ మొదలైంది. తుది దశలో నాలుగు జిల్లాలు కాకుండా మూడే ఉంటాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం రూ.నాలుగు కోట్లు విడుదల చేయడం ఆసక్తి కలిగిస్తోంది. దీంతో నాలుగు జిల్లాలు ఉండడం ఖాయమని స్పష్టత వచ్చింది. అయితే నాలుగో జిల్లా హన్మకొండ పేరుతో ఉంటుందా.. వరంగల్‌ రూరల్‌గా ఉంటుందా అనేది మరో రెండు వారాల్లో తేలనుంది.  
మరిన్ని వార్తలు