పదోన్నతుల్లో పదనిసలు

23 Sep, 2016 23:42 IST|Sakshi
పదోన్నతుల్లో పదనిసలు

♦  నిబంధనలకు విరుద్ధంగా సీనియార్టీ జాబితా
♦  ఉపాధ్యాయ సంఘాల నిరసన
♦  కౌన్సెలింగ్‌లో డీఈఓతో వాగ్వాదం
♦  సోషల్, తెలుగు, హెచ్‌ఎం పోస్టుల భర్తీ

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన వివిధ కేటగిరీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం రాత్రి డీఈఓ కార్యాలయంలో డీఈఓ అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన కౌన్సెలింగ్‌లో గొడవ జరిగింది.   ఉపాధ్యా సంఘాలు, డీఈఓ మధ్య వివాదం నెలకొంది. ఈ నెల 17న సీనియార్టీ జాబితాను అధికారికంగా ప్రకటించారు.  కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే సమయంలో కొందరిని సీనియార్టీ జాబితాలోకి చేర్చారు. సోషల్‌ సబ్జెక్టుకు  సంబంధించి ఏకంగా ఏడుగురిని అప్పటికప్పుడు సీనియార్టీ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితా వెల్లడించిన రోజు తర్వాత వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.

అయినా వారిని చేర్చడం వెనుక ఆంతర్యమేమిటో విద్యాశాఖ అధికారులకే తెలియాలి.   1983 నుంచి 1994 డీఎస్సీల వరకు 157 మంది పదోన్నతులు తీసుకోలేదని గుర్తించారు. వీరందరికీ నోటీసులు కూడా ఇచ్చారు.   వీరిలో కొందర్ని మాత్రమే సీనియార్టీ జాబితాలో చేర్చి తక్కిన వారిని చేర్చకపోవడాన్ని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, ఆప్టా, ఎస్‌ఎల్‌టీఏ సంఘాల నాయకులు తప్పుబట్టారు. దీనిపై డీఈఓతో వాగ్వాదానికి దిగారు. చివరకు వారు కౌన్సెలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు  ప్రకటించి వెల్లిపోయారు.

రెండుసార్లకు పైగా పదోన్నతులు తిరస్కరించిన ఐదుగురు టీచర్లు గతంలో కోర్టుకు వెళ్లగా అప్పటి డీఈఓ మధుసూదన్‌రావు 154 జీఓ ప్రకారం వారు పదోన్నతులకు అనర్హులని కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ఇదే తరహాలో ఉన్న కొన్ని కేసులు ప్రస్తుత కౌన్సెలింగ్‌తో పరిగణపలోకి ఎలా తీసుకుంటారని ఉపాధ్యాయ సంఘాలు  ప్రశ్నిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు (జిల్లా పరిషత్‌) 6, ఎస్‌ఏ సోషల్‌  9, తెలుగు 3, హిందీ 2, పీడీ 2 పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద సోషల్‌ 23, హెచ్‌ఎం 3, తెలుగు 3, పీడీ 2, ఫిజికల్‌సైన్స్‌ పోస్టును భర్తీ చేశారు.

మరిన్ని వార్తలు