సమ్మెటివ్‌ పోటు

27 Mar, 2017 23:02 IST|Sakshi
సమ్మెటివ్‌ పోటు
వార్షిక పరీక్షల మూల్యాంకనంపై గందరగోళం
 ట్రిపుల్‌ఆర్‌ అమలుకు సమయమేది
 అసంబద్ధ విధానాలతో అస్తవ్యస్తం
ఏలూరు సిటీ : 
సర్కారు బడుల్లో అమలు చేస్తున్న నూతన విధానాలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. కొత్త ప్రణాళికలు పాఠశాలలో విద్యను అభివృద్ధి చేయడానికి బదులు నిర్వీర్యం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న  నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ), సమ్మెటివ్‌3 (వార్షిక) పరీక్షలు కొత్త ఇబ్బందులు తెస్తున్నాయి. పబ్లిక్‌ పరీక్షల తరహాలో 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మెటివ్‌ పరీక్షలు వారి పాలిట సమ్మెట పోటులా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
మూల్యాంకన ఎలా..
ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఏకరీతిలో అమలు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనపై గందరగోళం నెలకొంది. 8, 9వ తరగతుల విద్యార్థుల జవాబు పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకన చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఒక్కో మండలం పరిధిలో సుమారు 5 వేల జవాబు పత్రాలు ఉంటాయి. వీటి మూల్యాంకన విధులకు 8 కిలోమీటర్ల దూరంలోని ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. నిబంధనల మేరకు 8 కిలోమీటర్ల పైబడి దూరంలోని ఉపాధ్యాయులను మూల్యాంకన విధులకు వినియోగిస్తే వారికి టీఏ, డీఏ చెల్లించాలి. ఈ సొమ్ములు ఎలా ఇస్తారు, ఉపాధ్యాయుల నియామకాలు ఎలా చేపడతారనే దానిపై సందిగ్ధత నెలకొంది.
 
త్రిపుల్‌ ఆర్‌ సాధ్యమా..!
నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో సమ్మెటివ్‌ పరీక్షలు నిర్వహించి, మూల్యాంకన చేసి విద్యార్థులను పై తరగతుల్లోకి పంపించి ఆ పాఠాలు బోధించాలని నూతన విద్యావిధానంలో పొందుపరిచారు. ప్రాథమిక పాఠశాలల్లో చదవటం, రాయటం, అర్థ గణితం (ట్రిపుల్‌ ఆర్‌) విధానాన్ని, ఉన్నత పాఠశాలల్లో ప్రతిక్రియాత్మక బోధన (రెమీడియల్‌ టీచింగ్‌) విధానాన్ని తెరపైకి తెచ్చారు. సమ్మెటివ్‌3 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మంగళవారం నుంచి పాఠశాలల్లో తరగతులు ప్రారంభం అవుతాయి. వేసవి సెలవులు ఇచ్చే వరకు 18 రోజులపాటు పాఠశాలలు పని చేస్తాయి. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి సబ్జెక్టు టీచర్లు 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు వెళతారు. ఈలోగా సమ్మెటివ్‌3 పరీక్షలకు సంబంధించి 8, 9 తరగతుల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు మరికొందరు ఉపాధ్యాయులు వెళ్తారు. ఏప్రిల్‌ 12 నుంచి ఓపెన్‌ స్కూల్స్‌ పరీక్షల విధులకు ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వెళతారు. దీనివల్లో ఉపాధ్యాయులు లేక పాఠశాలలన్నీ ఖాళీ అవుతాయి. ఈ పరిస్థితుల్లో ట్రిపుల్‌ ఆర్, రెమీడియల్‌ టీచింగ్‌ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో సందేహంగా మారింది. 
 
లోపభూయిష్ట విధానాలు
ప్రభుత్వం అమలు సాధ్యం కాని.. లోపభూయిష్ట విధానాలతో ప్రభుత్వ విద్యను గందరగోళంలోకి నెడుతోంది. కొత్త విద్యా విధానంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందే పరిస్థితులు కనిపించటం లేదు. ముందుగా పరీక్షలు నిర్వహించి, మళ్లీ తరగతులు పెట్టారు. ఉపాధ్యాయులను మూల్యాంకన విధుల్లోకి పంపితే పిల్లలకు చదువులు ఎవరు చెబుతారు. సమ్మెటివ్‌ పరీక్షల మూల్యాంకన వి«ధులకు హాజరైన 8 కిలోమీటర్లలోపు టీచర్లకు టీఏ, డీఏ ఇస్తారా. 
 గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్‌1938 జిల్లా ప్రధాన కార్యదర్శి
 
 
>
మరిన్ని వార్తలు