పీటముడి

26 Aug, 2017 22:47 IST|Sakshi

హెచ్చెల్సీకి నీటి విడుదల సందిగ్ధం
- నేడు టీబీ డ్యాం అధికారుల సమావేశం
– జిల్లాలో పూర్తిగా అడుగంటిని తాగునీటి ప్రాజెక్టులు
– ఎంపీఆర్, సీబీఆర్‌లో చుక్కనీరు కరువు
– మరో 20 రోజుల్లో అడుగంటనున్న పీఏబీఆర్‌
– తీవ్రమవుతున్న తాగునీటి సమస్య


సాక్షిప్రతినిధి, అనంతపురం: తాగునీటి ప్రాజెక్టులు అడుగంటినా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదా? ఎంపీఆర్, సీబీఆర్‌ తరహాలో పీఏబీఆర్‌లోనూ నీరు అడుగంటనుందా? ఇదే జరిగితే ‘అనంత’ తాగునీటి సంక్షోభంలో చిక్కుకోనుందా? తాజా పరిణాలు నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. సాగునీరు పక్కనపెడితే కనీసం తాగునీటి విషయంలోనూ ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. తుంగభద్ర డ్యాంలో సరిపడా నీరున్నా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించడంలో ఘోరంగా విఫలమవడం విమర్శలకు తావిస్తోంది.

హెచ్చెల్సీపై ఆధారపడి ‘సీమ’లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే తుంగభద్ర బోర్డు మాత్రం 32.5టీఎంసీలలో ఏటా సగటున 22 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తోంది. ఈ కేటాయింపులు కూడా సక్రమంగా అందడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విడుదల చేసే నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి. ఈ క్రమంలో ‘అనంత’ సాగునీటి అవసరాలు తీర్చేందుకు టీబీడ్యాం నుంచి కేసీ కెనాల్‌(కర్నూలు–కడప కెనాల్‌)కు దక్కాల్సిన 10టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా మళ్లించేలా జీఓ జారీ చేశారు. దీంతో 42.5టీఎంసీలు హెచ్చెల్సీకి టీబీ బోర్డు కేటాయించాలి. ఈ కోటా నీళ్లు దక్కించుకునేలా ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది. అయితే కేటాయింపులు సంగతి పక్కనపెడితే తాగునీటి అవసరాలకు కూడా నీరు తెప్పించలేకపోతుండటం గమనార్హం.

ప్రభుత్వ వైఫల్యంతోనే తాగునీటి సమస్య
హెచ్చెల్సీపై ఆధారపడి పీఏబీఆర్, సీబీఆర్‌లతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకులు ఉన్నాయి. ఏటా జూలైలో టీబీ డ్యాంకు హెచ్చెల్సీ నుంచి నీరు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు ముగుస్తున్నా నీటి విడుదల ఊసే కరువయింది. దీంతో సీబీఆర్‌(చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌)లో పూర్తిగా నీరు అడుగంటింది. ఎంపీఆర్‌(మిడ్‌పెన్నార్‌డ్యాం)లో అదే పరిస్థితి. పీఏబీఆర్‌లో ఒక టీఎంసీలోపే నీరుంది. మరో 20–30రోజుల్లో ఈ నీరు అడుగంటనుంది. ఇప్పటికే సీబీఆర్‌ పరిధిలో ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు తాగునీటి సమస్య ఉత్పన్నమైంది.

గతేడాది కంటే సమృద్ధిగానే డ్యాంలో నీటి నిల్వ
గతేడాది ఈ సమయానికి టీబీ డ్యాంలో 52.703 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూలైలో ఐఏబీ సమావేశం నిర్వహించి 23.1 టీఎంసీలు కేటాయించారు. ఇందులో 8.5టీఎంసీలు తాగునీటికి, 14.6టీఎంసీలు సాగుకు కేటాయించారు. ప్రస్తుతం డ్యాంలో 53.775 టీఎంసీలు ఉండగా.. 4300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా కనీసం తాగునీటికి కూడా నీటిని విడుదల చేయలేదు.

మంత్రులు, జిల్లా యంత్రాంగం ఘోర వైఫల్యం
‘అనంత’కు తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్, హెచ్చెల్సీ ఎస్‌ఈ టీబీ బోర్డుకు కొద్దిరోజుల కిందట విజ్ఞప్తి చేశారు. అయితే బోర్డు అధికారులు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆధారపడి విడుదల చేస్తామని చెప్పారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టీబీబోర్డు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత కూడా నీరు విడుదల చేయలేదు. కర్ణాటకలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఎలాగైనా కర్ణాటకలోని ఆయకట్టుకు నీరిచ్చి పంటలు పండించాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అనంత తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేస్తే కర్ణాటక రైతులు చౌర్యానికి పాల్పడుతారని, అందుకే నీరు విడుదల చేయలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.

దీన్నిబట్టి చూస్తే సకాలంలో నీరు విడుదల చేయించడంలో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు మంత్రులు కూడా ఘోర వైఫల్యం చెందారు. హెచ్చెల్సీపై ఆధారపడి 40వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. ఇందులో సింహభాగం మంత్రి కాలవ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోనే ఉంది. అయినప్పటికీ ఆయన స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 30న ఐఏబీ సమావేశం జరుగనుంది. ఆ సందర్భంగా నీటి విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ఆదివారం టీబీ డ్యాం అధికారులు ప్రత్యేకంగా సమావేశం  కానున్నారు. వచ్చే నెల 2న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు