గిద్దలూరులో పచ్చ రచ్చ

19 Jun, 2016 03:11 IST|Sakshi

అన్నా వర్గీయుడితో చెరువు పని చేయించిన ఇరిగేషన్ అధికారులు
నాకు తెలియకుండా పని చేస్తారా... అంటూ ముత్తుముల బెదిరింపు
బెంబేలెత్తి పని నిలిపిన అధికారులు పని నిలిపేస్తే సంగతి చూస్తానన్న అన్నా
ఎట్టకేలకు అన్నా వర్గీయుడితోనే  పని చేయించిన అధికారులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిద్దలూరు నియోజకవర్గంలో పచ్చ పార్టీ నేతల మధ్య రచ్చ పతాకస్థాయికి చేరింది. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులు ఢీ అంటే ఢీ అంటున్నారు. చిన్న అవకాశం దొరికినా... ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు. ఇది అధికారుల మెడకు చుట్టుకుంది. ఇద్దరు అధికార పార్టీ కీలక నేతలు కావడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక నియోజకవర్గంలోని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొమరోలు మండలం రాజుపాళెంలో శనివారం చెరువు ఆక్రమణల తొలగింపు పనులు ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలను మరోమారు బయటపెట్టాయి.

 వివరాలలోకెళితే...కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే చెరువులను సర్వే చేయించే కార్యక్రమం ఊపందుకుంది. సర్వే పూర్తయిన చెరువుల్లో ఆక్రమణలను తొలగింపులో భాగంగా నీరు-చెట్టు పనుల్లో ట్రెంచి ఏర్పాటు చేస్తున్నారు.

 కొమరోలు మండలం రాజుపాళెం చెరువులో అదే గ్రామానికి చెందిన అన్నా రాంబాబు వర్గీయుడు, ఆయకట్టు ప్రెసిడెంట్ పాండు ట్రెంచి నిర్మాణ పనులు ప్రారంభించారు. వంద మీటర్ల మేర ట్రెంచి నిర్మాణ పనులు జరిగాక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి తన అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిన ఇరిగేషన్ అధికారులు పనులు నిలిపివేసి జేసీబీని వెనక్కు పంపించేశారు. ఇంతలో అనుచరుల ద్వారా సమాచారం అందుకున్న అన్నా రాంబాబు ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేశారు.

  తన వర్గీయుడు చేస్తున్న పనిని ఎలా నిలిపివేస్తారంటూ అధికారులను చీవాట్లు పెట్టారు. నిబంధనల ప్రకారం చెరువు ఆయకట్టు ప్రసిడెంట్‌కు అప్పగించాలని, ఆయన ఆధ్వర్యంలోనే  పనులు జరుగుతున్నప్పుడు ఎలా నిలిపివేస్తారంటూ అధికారులను నిలదీశారు. ఇద్దరు నేతలు ఫోన్లు చేసి చివాట్లు పెట్టడంతో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వారి సూచన మేరకు ఎట్టకేలకు ఆయకట్టు ప్రసిడెంట్ పాండు ద్వారానే పనులు చేయించి ఊపిరి పీల్చుకున్నారు.

 అయితే ఆ తర్వాత అశోక్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి తనకు తెలియకుండా ఎక్కడా పనులు ప్రారంభించవద్దని... అవసరమైతే ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానంటూ ఇరిగేషన్ అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. ఇటు ఎమ్మెల్యే, అటు మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య నలిగిపోతున్నామని, నియోజకవర్గంలో పని చేసే పరిస్థితి లేదని నీటిపారుదల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఇరువురి మధ్య అధికారులు బలిపశువులుగా మారుతున్నారని అధికారులు వాపోయారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇరువర్గాల మధ్య పని చేసే వాతావరణం లేదని అధికారులు పేర్కొంటుండటం గమనార్హం.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా