కేయూ మహిళా క్రికెట్‌ జట్టుకు అభినందనలు

16 Oct, 2016 21:05 IST|Sakshi
కేయూ మహిళా క్రికెట్‌ జట్టుకు అభినందనలు
 విజయవాడ స్పోర్ట్స్‌ : చెన్నై సత్యభామ యూనివర్సిటీలో శనివారం ముగిసిన సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ మహిళా క్రికెట్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన కృష్ణా యూనివర్సిటీ జట్టును వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సుంకరి కృష్ణారావు అభినందించారు. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ మహిళా క్రికెట్‌ టోర్నీకి ఎంపికైన సందర్భంగా కేయూ ఫిజికల్‌ డైరెక్టర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యాన స్థానిక ఓ హోటల్‌లో ఆదివారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీసీ మాట్లాడుతూ మహిళా క్రికెట్‌ జట్టు సౌత్‌ ఇండియా స్థాయిలో రన్నరప్‌గా నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. జట్టులోని ప్రతి క్రికెటర్‌కు రూ.3వేల నగదు ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. జట్టును విజయపథంలో నడిపిన కోచ్‌ బి.ఉదయ్‌కుమార్, మేనేజర్‌ జి.సుధారాణిని వీసీ అభినందించారు. కేయూ పీజీ సెంటర్‌ ప్రత్యేక అధికారి మండవ బసవేశ్వరరావు మాట్లాడుతూ ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ క్రికెట్‌ టోర్నీలో విజేతగా నిలిస్తే జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ.5,116 చొప్పున అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీడీల అసోసియేష్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.డేవిడ్, వర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 
మరిన్ని వార్తలు