‘ఓటు’ అడిగే హక్కు కాంగ్రెస్, టీడీపీలకు లేదు

19 Aug, 2017 01:36 IST|Sakshi
‘ఓటు’ అడిగే హక్కు కాంగ్రెస్, టీడీపీలకు లేదు

∙ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యం
∙ మాజీ మంత్రి ముత్తా,  కో–ఆర్డినేటర్‌ శశిధర్‌


కాకినాడ : ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించిన, అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ పేర్కొన్నారు. స్థానిక హెలికాన్‌ టైమ్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీరు మాట్లాడుతూ కాకినాడను తాము అభివృద్ధి చేశామంటే తామే అభివృద్ధి చేశామంటూ కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడచిన 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి ఎవరు రూపకల్పన చేశారో వాస్తవాలు పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. రహదారుల విస్తరణ, మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం, రాజీవ్‌ గృహకల్ప సహా ఎన్నో కార్యక్రమాలు తన హయాంలో రూపుదిద్దుకున్నవేనని ముత్తా పేర్కొన్నారు.

ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల కోసం యాంకరేజ్‌ పోర్టుపై ఆధారపడ్డ ఎంతోమంది కార్మికులను రోడ్డున పడేసింది ఎవరని ముత్తా గోపాలకృష్ణ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల ద్వారా సమాంతర వ్యవస్థను నడుపుతూ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. పేదలకు దక్కాల్సిన పింఛన్లు, ఇళ్లు, రేషన్‌ కార్డులకు కూడా సొమ్ములు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల అస్తవ్యస్త విధానాలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించారని పేర్కొన్నారు. కాకినాడకు డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేయలేకపోయారని, డ్రైనేజీ వ్యవస్థ గందరగోళంగా ఉందని, ట్రాఫిక్‌ సమస్యను గాలికి వదిలేశారంటూ ధ్వజమెత్తారు. పిఠాపురం రాజా స్థలాలు, పోర్టు భూములు, పైడా ట్రస్ట్‌ భూముల కబ్జాలపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. గృహకల్ప మరమ్మతులకు రూ.10 వేలు ఇచ్చినట్టు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి విదల్చకుండా ఉత్తుత్తి ప్రచారం నిర్వహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

సిటీ కో–ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ మాట్లాడుతూ ఎన్నికలు నిర్వహించకుండా తెలుగుదేశం ప్రభుత్వం మోకాలడ్డిందని, చివరకు న్యాయస్థానం జోక్యంతో కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించగలదని ముత్తా శశిధర్‌ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు